
ఆనాటి రాజులు నిర్మించిన పురాతన కట్టడాలు కళా సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. తరాలు మారినా వారి పాలనకు చిహ్నంగా అవి విరాజిల్లుతున్నాయి. రాతి కట్టడాలపై ఉన్న పలు రకాల శిల్ప కళాకృతులు నాటి కళాకారుల చాతుర్యానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. సిద్దవటంలోని చారిత్రక మట్లిరాజుల కోటలో శిల్ప సంపద కొన్నేళ్ల కిందట వరకు రంజింపజేశాయి. క్రమంగా మహా శిల్ప సంపదపై పరిరక్షణ లోపంతో క్రమంగా కనుమరుగవుతుండడంపై సందర్శకులు పెదవివిరుస్తున్నారు.
వైయస్సార్ కడప జిల్లా సిద్దవటం పెన్నానది ఒడ్డున 1081లో రాజేంద్ర చోళుని సేవకుడు అరవలమారి అన్నం బండారి మొదటగా మట్లి కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1527లో మట్టికోట స్థానంలో మట్లి ఎల్లమరాజు బలమైన రాతికోట నిర్మించారు. కోటలో రాణిమహిల్, మరికొన్ని కట్టడాలకు అద్భతమైన శిల్ప కళాకృతులు నెలకొన్నాయి. భక్తిభావం కలిగేలా కొన్ని శిల్పకళలను రమణీయంగా చిత్రీకరించారు. సాయుధులైన యుద్ధవీరుల శిల్పాలను వీర రసోత్పాదనకు చిహ్నంగా రూపొందించారు. రాతి స్తంభాలకు స్వారీ చేసేలా శిల్పాలు ఎంతో చక్కగా నిర్మించారు. రాతి కట్టడాలపై గరుత్మంతుడు, ద్వారపాలకులైన జయ విజయులు, బలశాలులు, కుబేరుడు, వినాయకుడు, రామాయణ గాథలు తెలిపే సీత, రామలక్ష్మణులు, హనుంతుడు, శాతవాహనులు, చోళరాజుల చిహ్నం ఎనుగులు, బలశాలలు శిల్పాలు నెలకొన్నాయి.
పర్యాటకుల విస్మయం
పలు రకాల శిల్పాలు, సాయుధులైన యుద్ధవీరులు స్వారీ చేస్తున్నట్లు ఉన్న శిల్పాలు నిర్వహణ లోపంతో కరిగిపోతూ కళాహీనంగా మారి కనుమరుగవుతున్నాయి. మరికొన్ని దేవతామూర్తుల ఆకృతులకు ఉన్న తల, కాళ్లు, చేతులు, వివిధ రకాల భాగాలు పగిలిపోయాయి. రాతి స్తంభాలు కొన్ని వర్షానికి తడిచి కరిగిపోతూ తేలికపాటి గుంతలు ఏర్పడ్డాయి. స్తంభాలపై అద్భుతమైన శిల్పకళలతో నిర్మించిన తుంబరనాథాల రూపాలు రూపు కోల్పోతున్నాయి. కోటలో శిల్ప కళాకృత సంపద పరిరక్షణ ప్రశ్నార్థకరంగా మారిందని పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్తాం
మట్లి రాజుల కోటలో శిల్ప సంపద పరిరక్షణ కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రసాయనిక శుద్ధి విభాగం అధికారులకు సమాచారం తెలిపి వారితో శిల్ప సంపదను పరిశీలింపజేస్తాం. వారితో ప్రతిపాదనలు పంపి శిల్ప సంపద పరిరక్షణకు కృషి చేస్తాం. – ఢాకారెడ్డి, జిల్లా పురావస్తుశాఖ అధికారి





