ArticlesNews

ఇంధన సంక్షోభంతో పాత రోజులు మళ్లీ ఎద్దుల బండ్లు రీఎంట్రీ

32views

ఇరాన్- అమెరికా యుద్ధంతో తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడింది. పెట్రోలు, డీజిల్ ధరలు రెక్కలు తొడిగాయి. దీని ప్రభావం కొన్ని గ్రామీణ ప్రాంతాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా పల్లెల్లో ఎద్దుల బండ్లపై రాకపోకలు మళ్లీ పెరిగాయి. ఇక పొలాలను దున్నేందుకు చాలా ఏళ్ల తర్వాత ట్రాక్టర్లకు బదులుగా ఎద్దులను రంగంలోకి దింపారు. పలువురు గ్రామీణ యువకులు తమ ఎద్దుల బండ్లలో సరుకులను రవాణా చేస్తూ ప్రతిరోజూ రూ.1000 నుంచి రూ.1500 దాకా సంపాదిస్తున్నారు. ఇంతకీ ఈ పల్లెలు ఎక్కడ ఉన్నాయి? ఒకప్పుడు ఓ ఎంపీ చొరవతో ఎద్దుల బండ్లకు నంబర్ ప్లేట్లనూ కేటాయించారు తెలుసా? వాటికి లైసెన్సులు ఇవ్వడంతో పాటు ట్యాక్సులూ వేసే వారు. ఈ అంశాలపై పరిశీలనాత్మక కథనమిది.

ట్రాక్టర్ల స్థానంలోకి ఎద్దుల బండ్లు
బీహార్ గయ జిల్లాలోని కర్మోని గ్రామానికి చెందిన డ్రైవర్ వినయ్ యాదవ్‌కు సొంత ట్రాక్టర్ ఉంది. గతంలో ఆయన ట్రాక్టర్‌ను వ్యవసాయంతో పాటు సరుకులను రవాణా చేసేందుకు వినియోగించేవారు. కానీ డీజిల్ సంక్షోభంతో వినయ్ ఆలోచన మారింది. ఆయన ట్రాక్టరును పక్కన పెట్టారు. రూ.60వేలతో రెండు జతల ఎద్దులను, ఒక గేదెను కొన్నారు. ఇంట్లో మూలకు పడి ఉన్న పాత ఎద్దుల బండ్లను బాగు చేయించి, వాటితో సరుకులను రవాణా చేస్తున్నారు. వినయ్ తన దగ్గరున్న రెండు ఎద్దుల బండ్లతో ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి సరుకులను రవాణా చేస్తూ, రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 దాకా సంపాదిస్తున్నారు. ట్రాక్టరులో సరుకుల రవాణాకు అధిక ఛార్జీలను చెల్లించడానికి ప్రజలు ఇష్టపడటం లేదని, అందుకే ఎద్దుల బండ్లతో ఆ పనిని చేస్తున్నానని వినయ్ చెప్పుకొచ్చారు.

ట్రాక్టర్లతో పొలం దున్నే ఛార్జీలు డబుల్
“గతంలో ట్రాక్టర్‌తో పొలం దున్నడానికి ఒకటింపావు గుంట (ఒక కట్టా)కు రూ.100 దాకా ఖర్చయ్యేది. కానీ డీజిల్ ధరలు పెరగడంతో ఇప్పుడా ఛార్జీ డబుల్ అయింది. సరిపడా డీజిల్ లేదనే కారణంతో ట్రాక్టర్ల యజమానులు మా పొలాలను దున్నడానికి నిరాకరిస్తున్నారు” అని గయ జిల్లాకు చెందిన రైతు సంజయ్ యాదవ్ తెలిపారు.

జన జీవితాలకు ఆధారంగా ఎద్దుల బండ్లు
ఈనేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులు మళ్లీ ఎద్దుల బండ్లను రంగంలోకి దింపారు. చాలా సంవత్సరాల తర్వాత, ఇప్పుడు వారి పొలాలను ఎద్దులు దున్నుతున్నాయి. ఒకప్పుడు గ్రామాలకు గుర్తింపుగా నిలిచిన ఎద్దుల బండ్లు ఇప్పుడు మరోసారి ప్రజల ఉపాధి, వ్యవసాయం, దైనందిన జీవితానికి ముఖ్యమైన ఆధారంగా మారుతున్నాయి. గయ జిల్లాలోని కర్మోని, నిస్ఖా, ఫజ్లహా, గోడ్వా దీహ్, నవ్వా దీహ్, మాన్సీ దీహ్, మున్షిచక్, కురుమ్దిహ్, కుషా, పక్రి, బరచట్టి, ఇమామ్‌గంజ్, బాంకే బజార్, దోభి, బోధగయ, షేర్‌ఘాటి వంటి అనేక గ్రామాలలో వేలాది ఎద్దుల బండ్లు రంగంలోకి దిగాయి.

ఎద్దుల బండ్ల నిర్వహణ ఈజీ
“ఎద్దుల బండిని ఉపయోగించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఎద్దులకు మేత, బండికి గ్రీజు పెట్టడంతో కలిపి వారానికి సుమారు 1000 రూపాయలే ఖర్చవుతుంది. ఎద్దుల బండిని నడిపితే రోజుకు రూ.750 నుంచి రూ.1000 దాకా సంపాదించొచ్చు. ఇప్పుడు ఎద్దుల బండ్లకు ఇనుప చక్రాలను బిగిస్తున్నారు. దీనివల్ల అవి మరింత బలంగా, మన్నికగా తయారవుతున్నాయి” అని ఎద్దుల బండిని నడిపే అనిల్ యాదవ్ చెప్పారు.

ఎద్దుల బండిపైనే మార్కెట్‌కు వెళ్తున్నాం
“నేను గతంలో టెంపోలో మార్కెట్‌కు వెళ్లేదాణ్ని. కానీ ఇప్పుడు ఇంధనం కొరత కారణంగా టెంపోల రాకపోకలు ఆగిపోయాయి. ఎద్దుల బండి ఛార్జీ దాదాపు టెంపో ఛార్జీతో సమానంగా ఉంటుంది. గ్రామంలోని పేద కుటుంబాలకు ఇది అత్యంత చౌకైన రవాణా సాధనంగా మారింది. ప్రస్తుతం మేం ఎద్దుల బండిపైనే మార్కెట్‌కు వెళ్తున్నాం” అని గ్రామీణ మహిళ సుశీల దేవి తెలిపారు.

ఇంధన సంక్షోభంతో మళ్లీ పాతరోజులు
“మా తాతగారు ఎద్దుల బండి, పల్లకీలో ప్రయాణించేవారు. ఇంధన సంక్షోభంతో మళ్లీ అలాంటి సమయమే ఇప్పుడొచ్చింది. ప్రస్తుతం కొట్టాలకు సరుకులను రవాణా చేయడానికి ఎద్దుల బండ్లనే వాడుతున్నారు. పొలం పనుల్లోనూ ఎద్దులను వినియోగిస్తున్నారు. ఇంధనం కొరత కారణంగా గ్రామాల్లో టెంపోలు, ట్రాక్టర్ల సేవలు నిలిచిపోయాయి” అని రైతు తంజీల్ ఉర్ రెహమాన్ ఖాన్ చెప్పారు.

ఇప్పుడు మళ్లీ వాటి అవసరం వచ్చింది
“నా వయసు 80 ఏళ్లు. గతంలో 7 ఎద్దుల బండ్లతో నా పెళ్లి ఊరేగింపు జరిగింది. నా కొడుకు పెళ్లి ఊరేగింపు కూడా ఎద్దుల బండిలోనే జరిగింది. 2000 సంవత్సరం తర్వాత ఎద్దుల బండ్ల సేవలు చాలావరకు తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు మళ్లీ వాటి అవసరం వచ్చింది. అందుకే నేను ఎద్దుల బండ్లను నడుపుతున్నాను. నా సొంత పనులతో పాటు ఇతరుల సరుకులను కూడా వాటితో రవాణా చేస్తున్నాను” అని 80 ఏళ్ల విష్ణుధారి తెలిపారు.

1990 నుంచి ఎద్దుల బండి నడుపుతున్నాను
“నేను 1990 నుంచి ఎద్దుల బండి నడుపుతున్నాను. గత కొన్నేళ్లుగా ఇది నష్టాల వ్యాపారంగా మారింది. కానీ ఇప్పుడు నా ఆదాయం పెరిగింది. నేను 5 కిలోమీటర్ల వరకు సరుకులను రవాణా చేయడానికి రూ.250 తీసుకుంటాను. రోజుకు మూడు ట్రిప్పులు వేసి రూ.700 నుంచి రూ.800 వరకు సంపాదిస్తాను” అని రాజు యాదవ్ తెలిపారు.

ఎద్దుల బండ్లకు నంబర్ ప్లేట్లు
ఎద్దుల బండ్లపై చర్చ జరుగుతున్న వేళ బిహార్ మొదటి దళిత ఎంపీ బాబు కిరాయ్ ముసహర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన 1952లో సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై భాగల్పూర్-పూర్నియా రిజర్వుడ్ సీటు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనను పేదలు, కార్మిక వర్గాల గొంతుకగా పరిగణించేవారు. భారత రాజ్యాంగం ప్రకారం రవాణా, స్థానిక పన్నులు, మున్సిపాలిటీలు, జిల్లా బోర్డుల నిర్వహణ అనేది పూర్తిగా రాష్ట్ర జాబితా పరిధిలోకి వస్తుంది. దీని ప్రకారం ఎద్దుల బండ్లను నియంత్రించే, పన్నులు వేసే హక్కులు స్థానిక సంస్థలవే.

అయితే అవి కాగితాలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కాకపోవడంతో నాటి ఎంపీ బాబు కిరాయ్ ముసహర్ చొరవ చూపారు. ఎద్దుల బండ్లను నియంత్రించడానికి పన్ను, లైసెన్స్ వ్యవస్థను స్థానిక సంస్థలతో అమలు చేయించారు. ఆ సమయంలో ప్రతీ ఎద్దుల బండికి ఒక నిర్దిష్ట నంబరును కేటాయించేవారు. టిన్ ప్లేట్‌పై ఆ నంబరును ముద్రించి వాటికి బిగించేవారు. ఎద్దుల బండ్ల వివరాలను గ్రామ పంచాయతీలలో నమోదు చేసి ఉంచేవారు. వాటిని గ్రామీణ రవాణా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించేవారు.