
మన సనాతన ధర్మంలో నిత్యం ఆచరించాల్సిన పవిత్ర విధి సంధ్యావందనం. పగలు, రాత్రి కలిసే సంధి సమయాల్లో చేసే ప్రార్థన ఇది. ‘సంధ్యాయాం వందనం’ అన్నారు. అంటే సంధి కాలంలో పరమాత్మను ఆరాధించడం అని అర్థం. ఇందులో భాగంగా చేసే ఆచమనం, ప్రాణాయామం, గాయత్రీ మంత్ర జపం మనసును శుద్ధి చేసి, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానకాంతిని ప్రసాదించమని కోరుకుంటాం. సంధ్యావందనం గొప్ప ఆరోగ్య సూత్రం. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యకిరణాల తీవ్రత తక్కువగా ఉండి, శరీరానికి మేలుచేసే సూర్యకాంతి పోషకాలను, సానుకూల శక్తిని అందిస్తాయి. ఈ ప్రక్రియలో చేసే ‘ప్రాణాయామం’ శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. మంత్రోచ్చారణ వల్ల కలిగే ప్రకంపనలు మెదడులోని నరాలను ఉత్తేజితం చేసి ఏకాగ్రతను పెంచుతాయి. అర్ఘ్యం దృష్టి దోషాలను నివారిస్తుంది. సంధ్యావందనం దైవభక్తిని పెంపొందిస్తూనే శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను సమకూరుస్తుంది.




