
26views
మానవ నాగరికత ప్రగతి పథంలో పయనిస్తున్న తరుణంలో, ఐరోపా శ్వేతజాతి దేశాలు వ్యాప్తి చేసిన వలసవాదం, బానిసత్వ వ్యవస్థ ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టాయి. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ తమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణ కోసం ఆఫ్రికా, ఆసియా ఖండాల సంపదను దోచుకోవడమే కాకుండా, అక్కడి స్థానిక ప్రజల అస్తిత్వాన్ని పూర్తిగా నాశనం చేశాయి. ‘శ్వేతజాతీయుల భారం’ (Whiteman’s Burden) అనే కపట సిద్ధాంతంతో, వెనుకబడిన సమాజాలకు నాగరికత నేర్పుతామనే సాకుతో కోట్ల మందిని శారీరక, మానసిక బానిసలుగా మార్చారు. ఈ సుదీర్ఘ అణచివేత ఘోరాలకు కేవలం రాజకీయ స్వార్థమే కాదు, సామ్రాజ్యవాదానికి దైవకృప పేరిట లైసెన్స్ ఇచ్చిన వాటికన్ క్యాథలిక్ చర్చ్ మతపరమైన కుట్రలు ప్రధాన చోదక శక్తులుగా నిలిచాయి. మానవ హక్కులను శాస్త్రీయ ఆధునికతను శతాబ్దాల పాటు అణచివేసిన ఈ చారిత్రాత్మక వాస్తవం నేటికీ ప్రపంచ చరిత్రలో ఒక నిలువెత్తు నల్లటి అధ్యాయం. శతాబ్దాల కిందటే బానిసత్వానికి అనుమతినిచ్చిన వాటికన్‌లోని పోప్ యంత్రాంగమైన ‘హోలీ సీ’ నిర్ణయంపై తాజాగా ప్రస్తుత పోప్ లియో XIV (14) క్షమాపణ చెప్పారంటే ఇదెంత ఘోరమైన నేరమో, మహాపాపమో మాటల్లో చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో ఐరోపా సమాజం ప్రధానం కేంద్రంగా కొనసాగిన బానిసత్వంపై ఒక సింహావలోకనం ఇది..
ఆఫ్రికన్లతో బానిస వ్యాపారం
పదహారవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా దేశాలు ఆఫ్రికా ఖండాన్ని ఒక బానిసల సంతగా మార్చాయి. ఆఫ్రికా అడవుల నుండి, గ్రామాల నుండి నల్లజాతీయులను జంతువుల వలె వేటాడి బంధించి, ఓడల అడుగుభాగంలో గొలుసులతో కట్టి అమెరికా, కరీబియన్ దీవులకు తరలించారు. ఈ ప్రయాణంలోనే దాదాపు 20 శాతం మంది ఆఫ్రికన్లు రోగాలు, ఆకలితో చనిపోయి సముద్రం పాలయ్యారు. అమెరికాకు చేరిన వారిని సంతలో పశువుల్లా వేలం వేసి, అక్కడి పత్తి, పొగాకు, చెరకు తోటల్లో ఉచిత శ్రమ కోసం వాడుకున్నారు. వీరికి ఎలాంటి వేతనం, మానవ హక్కులు ఉండేవి కావు. ఎదురు తిరిగితే కొరడా దెబ్బలు, అంగవికలురుగా చేయడం, చంపేయడం సర్వసాధారణంగా జరిగేది. బానిసల పిల్లలు పుట్టడమే బానిసలుగా పుట్టేవారు. తల్లిదండ్రులను ఒక యజమానికి, పిల్లలను మరొక యజమానికి అమ్మి కుటుంబాలను శాశ్వతంగా విడదీసేవారు. బానిసలకు రేటుకట్టడంలోనూ క్రూరత్వం ప్రదర్శించేవారు. వీరిని తన్నడం, కొట్టడం, దేనితోనైనా గుచ్చడం చేసి, ఆ సమయంలో ఎక్కువ సమయం పాటు ఓర్చుకున్నవారికి ఎక్కువ రేటు ఉండేది.
రూట్స్ పుస్తకంలో బానిసత్వ నిలువెత్తు రూపం
శ్వేతజాతీయుల ఈ క్రూరత్వాన్ని అమెరికన్ రచయిత అలెక్స్ హేలీ రాసిన చారిత్రాత్మక నవల ” రూట్స్: ది సాగా ఆఫ్ యాన్ అమెరికన్ ఫ్యామిలీ” (Roots) ప్రపంచం ముందు ఉంచింది. ఇందులో పశ్చిమ ఆఫ్రికాలో స్వేచ్ఛగా తిరిగే ‘కుంట కింటే’ అనే యువకుడిని శ్వేతజాతీయులు అపహరించి, అమెరికాకు తెచ్చి అతనికి బలవంతంగా ‘టోబి’ అని క్రైస్తవ పేరు పెట్టడం కనిపిస్తుంది. కుంట కింటే తన అసలు పేరును, ఆఫ్రికా సంస్కృతిని మర్చిపోవడానికి నిరాకరిస్తూ ఎన్నో శారీరక హింసలను అనుభవిస్తాడు. ఒక దశలో పారిపోవడానికి ప్రయత్నిస్తే అతని కాలి పంజాను నరికేస్తారు. ఈ పుస్తకం కేవలం కుంట కింటే కథ మాత్రమే కాదు, అతని తర్వాతి ఏడు తరాల పాటు ఆఫ్రికన్ అమెరికన్లు అనుభవించిన నరకాన్ని, వారి ఆత్మగౌరవ పోరాటాన్ని కళ్లకు కడుతుంది.

భారతదేశంపై బ్రిటిష్ ఆర్థిక దోపిడీ
ఆఫ్రికాలో ప్రజలను నేరుగా గొలుసులతో బంధించి వారిని బానిసలుగా మార్చితే, భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ రాజ్ ‘చట్టాలు’, ‘వ్యాపారం’ పేరుతో పరోక్ష బానిసత్వాన్ని అమలు చేశాయి. ఎన్నో అరాచకాలను చేశాయి. మన ప్రజల ధన, మన ప్రాణాలను హరించాయి. ప్రసిద్ధ ఆర్థికవేత్తల పరిశోధనల ప్రకారం, 1765 నుండి 1938 మధ్య కాలంలో బ్రిటన్ భారతదేశం నుండి దాదాపు 45 ట్రిలియన్ డాలర్ల సంపదను లండన్‌కు తరలించింది. భారతీయ పన్నుల డబ్బుతోనే బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం విజయవంతమైంది. బ్రిటిష్ వారి తప్పుడు ల్యాండ్ రెవెన్యూ విధానాలు, ఆహార ధాన్యాలకు బదులు నీలిమందు (ఇండిగో), పత్తి పండించాలనే బలవంతపు నిబంధనల వల్ల దేశంలో తీవ్రస్థాయిలో కృత్రిమ కరవులు వచ్చాయి. 1943 నాటి ‘బెంగాల్ కరవు’ సమయంలో దాదాపు 30 లక్షల మంది భారతీయులు ఆకలితో చనిపోయారు. అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ భారతీయులపై ద్వేషంతో, ఇక్కడి ధాన్యపు నిల్వలను ఐరోపా సైనికుల కోసం తరలించారు. 1833లో బ్రిటన్ తన సామ్రాజ్యంలో అధికారికంగా బానిసత్వాన్ని రద్దు చేసిన తర్వాత, ఆఫ్రికన్ బానిసల స్థానంలో భారతీయులను వాడుకుంది. ‘గిర్మితియా’ లేదా ఒప్పంద కార్మికుల (Indentured Labour) వ్యవస్థ ద్వారా లక్షలాది మంది పేద భారతీయులను ఫిజీ, మారిషస్, కరీబియన్ దీవులు, సౌత్ ఆఫ్రికా, మలేషియా దేశాలకు తరలించి బానిసల కంటే ఘోరమైన పరిస్థితుల్లో తోటల్లో పని చేయించుకున్నారు.
ఫ్రాన్స్ వలసపాలన క్రూరత్వం
ఇదే కాలంలో ఫ్రాన్స్ దేశం కూడా తన వలసరాజ్యాలలో అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. ఫ్రెంచ్ విప్లవం ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ అని నినదించినప్పటికీ, కరీబియన్ దీవుల్లోని హైతీలో ఫ్రెంచ్ వారు నల్లజాతీయులను చెరకు తోటల్లో ఎంతగా హింసించారంటే, అక్కడ బానిసల సగటు ఆయుర్దాయం కేవలం 21 ఏళ్లుగా ఉండేది. 1804లో హైతీ విప్లవం ద్వారా వారు స్వేచ్ఛ పొందినప్పటికీ, ఫ్రాన్స్ ఆ దేశంపై భారీ ఆర్థిక జరిమానా విధించి దశాబ్దాల పాటు కోలుకోకుండా చేసింది. అటు ఆఫ్రికాలోని అల్జీరియా, సెనెగల్ వంటి దేశాలలో ఫ్రాన్స్ అక్కడి ప్రజల భాషను, సంస్కృతిని పూర్తిగా నిషేధించి, వారిని బలవంతంగా ఫ్రెంచ్ పౌరులుగా మార్చడానికి ప్రయత్నించింది. దీనిని వ్యతిరేకించిన లక్షలాది మందిని ఫ్రెంచ్ సైన్యం ఊచకోత కోసింది.
వాటికన్, రోమన్ క్యాథలిక్ చర్చి కుట్రలు
అసలు ఈ శ్వేతజాతి ద్వారా జరిగిన అణచివేత చర్యలు, సాంస్కృతిక విధ్వంసాలను వెనుకనుండి నడిపించింది వాటికన్ సామ్రాజ్యమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. శతాబ్దాల పాటు ఐరోపాలో సైన్స్, హేతువాదం, మానవ హక్కులు వంటి ఆధునిక విలువలపై చర్చి ఉక్కుపాదం మోపింది. భూమి గుండ్రంగా ఉందని చెప్పిన గెలీలియో వంటి శాస్త్రవేత్తలను గృహనిర్బంధంలో ఉంచి, జియోర్దానో బ్రూనోను సజీవ దహనం చేసి, విజ్ఞాన శాస్త్రాన్ని, మానవ పరిణామాన్ని కాలరాసింది. వలసపాలన కాలంలో ఐరోపా రాజులకు చట్టబద్ధత కల్పిస్తూ జారీ చేసిన ‘పాపల్ బుల్స్’ (Papal Bulls) ద్వారా ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండాలలోని స్థానిక ప్రజలను బానిసలుగా మార్చడానికి, వారి సంపదను దోచుకోవడానికి చర్చి లైసెన్స్ ఇచ్చింది. ఆయా దేశాల సంస్కృతులను ‘సాతాను సంస్కృతులు’గా చిత్రీకరిస్తూ, స్థానిక భాషలను, విద్యా వ్యవస్థలను ధ్వంసం చేసి బలవంతపు మతమార్పిళ్లకు తెరలేపింది.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఉద్యమం
1865లో అమెరికాలో బానిసత్వం చట్టబద్ధంగా రద్దయినప్పటికీ, ‘జిమ్ క్రో చట్టాల’ రూపంలో నల్లజాతీయులపై వర్ణవివక్ష (Segregation) కొనసాగింది. నల్లజాతీయులకు ప్రత్యేక పాఠశాలలు, హోటళ్లు, బస్సుల్లో వెనుక సీట్లు ఉండేవి. వీరికి ఓటు హక్కు కూడా నిర్వీర్యం చేయబడింది. దీనికి వ్యతిరేకంగా 1950వ దశకంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికన్ పౌర హక్కుల ఉద్యమానికి (Civil Rights Movement) నాయకత్వం వహించారు. ఆయన మహాత్మా గాంధీజీ ‘సత్యాగ్రహం’, ‘అహింస’ సిద్ధాంతాల ద్వారా ప్రభావితులై, శాంతియుత నిరసనల ద్వారానే శ్వేతజాతీయుల మనస్సాక్షిని కదిలించవచ్చని నమ్మారు. 1955లో రోసా పార్క్స్ అనే నల్లజాతి మహిళ బస్సులో శ్వేతజాతీయుడికి సీటు ఇవ్వడానికి నిరాకరించి అరెస్ట్ అయినప్పుడు, కింగ్ ఆధ్వర్యంలో నల్లజాతీయులంతా దాదాపు 381 రోజులు బస్సులను బహిష్కరించి విజయం సాధించారు. 1963 వాషింగ్టన్ చారిత్రాత్మక మార్చ్‌లో దాదాపు 2.5 లక్షల మంది ముందు కింగ్ ఇచ్చిన “ఐ హావ్ ఎ డ్రీమ్” (I Have a Dream) ఉపన్యాసం ప్రపంచాన్ని కదిలించింది. తన నలుగురు పిల్లలు ఒకరోజు చర్మం రంగును బట్టి కాకుండా వ్యక్తిత్వాన్ని బట్టి అంచనా వేయబడే దేశంలో జీవిస్తారనే ఆయన కల, అమెరికాలో 1964 పౌర హక్కుల చట్టం, 1965 ఓటింగ్ హక్కుల చట్టం రావడానికి కారణమైంది.
హోల్ సీ చట్టబద్ధత – అంతర్జాతీయ పక్షపాతం
మరోవైపు, రోమన్ క్యాథలిక్ చర్చి అత్యున్నత పాలక విభాగమైన ‘హోలీ సీ’ (Holy See)కి అంతర్జాతీయ చట్టాల పరిధిలో ఒక స్వతంత్ర దేశం వంటి చట్టబద్ధత కల్పించడం అత్యంత వివాదాస్పదమైన, పక్షపాతపూరితమైన అంశం. 1929లో ఫాసిస్ట్ పాలకుడు ముస్సోలినితో చేసుకున్న ‘లాటరన్ ఒప్పందం’ ద్వారా వాటికన్ సిటీ ఏర్పడగా, చర్చి తన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంది. ప్రపంచంలోని ఏ ఇతర మత సంస్థకూ లేని విధంగా, కేవలం ఒక మత పీఠమైన ‘హోలీ సీ’కి ఐక్యరాజ్యసమితి (UN) లో ‘శాశ్వత పరిశీలకుడి’ (Permanent Observer) హోదా కల్పించారు. దీనిని అడ్డుపెట్టుకుని చర్చి ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు, మానవ హక్కుల చట్టాలను దౌత్యపరంగా అడ్డుకుంటూ వస్తోంది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ పాస్టర్లు, బిషప్పులు లెక్కలేనంతమంది పిల్లలపై చేసిన లైంగిక వేధింపుల దారుణాల నుండి చర్చి అధికారులను రక్షించడానికి, ఈ ‘సార్వభౌమత్వ రక్షణ’ (Sovereign Immunity) చట్టాన్ని ఒక కవచంగా వాడుకుంటూ అంతర్జాతీయ న్యాయస్థానాల నుండి తప్పించుకుంటోందనే బలమైన విమర్శలు ఉన్నాయి.
కృత్రిమ మేధస్సుపై పోప్ లియో XIV ఆంక్షలు
ఈ చారిత్రాత్మక నేరాలను కప్పిపుచ్చుకోవడానికా అన్నట్లు, ఇటీవల పోప్ లియో XIV (14) తన తొలి అధికారిక బోధనా పత్రం (ఎన్సైక్లికల్ – ‘Magnifica Humanitas’) ద్వారా కృత్రిమ మేధస్సు (AI) నియంత్రణకు, దానిని ‘నిరాయుధీకరణ’ చేయాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆధునిక మానవత్వాన్ని కాలరాసే ప్రమాదం ఉందంటూ, ఇది డిజిటల్ యుగంలో “కొత్త బానిసత్వాలకు” దారితీస్తుందని హెచ్చరించారు. శతాబ్దాల పాటు మానవత్వాన్ని బానిస గొలుసులతో బంధించిన చర్చి, ఇప్పుడు ఆధునిక సాంకేతికతపై ఆంక్షలు విధించాలని మాట్లాడటం గమనార్హం. ఇదే పత్రంలో పోప్, గతంలో బానిసత్వం విషయంలో చర్చి వహించిన పాత్రకు క్షమాపణలు కోరినప్పటికీ, శతాబ్దాల పాటు సాగిన దోపిడీ, సాంస్కృతిక విధ్వంసం, మానవ హక్కుల హననం కేవలం క్షమాపణలతో చెరిగిపోనివి.
శ్వేతజాతి దేశాలు, చర్చి మత సామ్రాజ్యం సాధించిన నేటి ఆధునిక సంపద, వైభవం వెనుక ఆఫ్రికన్ల రక్తం, భారతీయుల శ్రమ, స్థానిక సంస్కృతుల విధ్వంసం దాగి ఉన్నాయి. క్రైస్తవ శ్వేతజాత్యహంకారం, చర్చి ఆధిపత్య ధోరణి మానవత్వానికి చేసిన గాయాలు పూడ్చలేనివి.





