News

డిజిటల్‌ సేవలపై భక్తులకు అవగాహన కల్పించాలి

32views

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు సింహగిరికి వచ్చే భక్తులకు దేవస్థానం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్‌ సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని దేవస్థానం ఈవో జె.వెంకటరావు సూచించారు. సింహగిరిపై వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులకు డిజిటల్‌ సేవలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన ఐటీ విభాగం సిబ్బంది.. పూజా, దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ విధానంలో ఎలా పొందాలో సేవా సంస్థల ప్రతినిధులకు ప్రాక్టికల్‌గా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈవో వెంకటరావు మాట్లాడుతూ.. సింహగిరికి వచ్చే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండకుండా, త్వరితగతిన స్వామివారిని దర్శించుకునేందుకు డిజిటల్‌ సేవలు ఎంతో దోహదపడతాయన్నారు. ‘మనమిత్ర’ వాట్సాప్‌ పోర్టల్‌, ఆన్‌లైన్‌ బుకింగ్‌, కియోస్క్‌ మెషిన్ల ద్వారా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి టికెట్లు పొందే పద్ధతులను భక్తులకు వివరించి, వారు వీటిని వినియోగించుకునేలా ప్రోత్సహించాలన్నారు.