News

ఆలయాలు నైతిక విలువల వికాస కేంద్రాలు

27views

అల్లూరి సీతారామరాజు జిల్లా పద్మనాభంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, కుంతీ మాధవ స్వామి ఆలయాన్ని త్రిదండి చినజీయర్‌ స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సదస్సులో భక్తులకు ఆయన ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా సమాజంలో నైతిక విలువలను పెంపొందించే దివ్య కేంద్రాలని పేర్కొన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులలో వినయం, విధేయత, వినమ్రత సహజంగానే అలవడుతాయన్నారు. భక్తి భావం పెరిగినప్పుడే సమాజంలో నైతిక విలువలు బలపడతాయని ఆయన వివరించారు. అలాగే ఆలయాలు ఆధ్యాత్మికతతో పాటు ఉపాధి కల్పించే కేంద్రాలుగా కూడా మారాలని ఆయన ఆకాంక్షించారు. పూర్వ కాలంలో గ్రామాల్లో కుండలతో వంటలు జరిగేవని, ప్రస్తుతం ఆ సంప్రదాయం తగ్గిపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పూరీ ఆలయంలో ప్రసాద తయారీ ద్వారా కుమ్మరి కుటుంబాలకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుందని ఆయన ఉదాహరణగా తెలిపారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధ్యాత్మికత అంటే సమాజ సేవతో కూడిన జీవనమని పేర్కొన్నారు.