
రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూసారం క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ఆచరించి భూమి ఆరోగ్యాన్ని కాపాడాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామంలో ఏపీసీఎన్‌ఎఫ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన జీవామృతాలు, కషాయాలు, బయో ఇన్‌పుట్స్ తయారీ విధానాలను పరిశీలించి నిర్వాహకుడు మహేశ్వర్ రెడ్డిని అభినందించారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 48,500 హెక్టార్లలో 85 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, మొత్తం 3.5 లక్షల మంది రైతుల్లో మరింత మంది ఈ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యరంగాల ద్వారా జిల్లా జీడీపీలో సుమారు 42 శాతం ఆదాయం వస్తోందని పేర్కొన్నారు. రైతులు పెద్దఎత్తున ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్ విధానాలను అమలు చేసి భూమిని సజీవంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు.





