News

అసోంలో ‘ఉమ్మడి పౌర స్మృతి​’ బిల్లుకు ఆమోదం

25views

అసోం అసెంబ్లీ బుధవారం ‘ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లు’ను ఆమోదించింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలన కోసం పంపాలని విపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. మతంతో సంబంధం లేకుండా పెళ్లి, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి వ్యక్తిగత విషయాలపై అందరికీ ఒకే రకమైన చట్టాలను తీసుకురావాలనే లక్ష్యంతో అసోం ప్రభుత్వం సోమవారం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా బహుభార్యత్వాన్ని నిషేధించాలని, సహజీవనం రిజిస్ట్రేషన్​ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ బిల్లు అసోంలో నివసించే ఏ షెడ్యూల్​ తెగలకు (ఎస్​టీ)లకు వర్తించదు.

అలా చేస్తే జైలు శిక్షే!
యూసీసీ ప్రకారం, ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సహజీవనం చేసే జంటలు తమ బంధాన్ని రిజిస్ట్రేషన్​ చేసుకోకపోతే 3 నెలల జైలు శిక్ష విధిస్తారు.

జవహర్​లాల్ నెహ్రూనే యూసీసీ కావాలన్నారు
ఈ బిల్లు ఆమోదం పొందడానికి కొద్ది సేపటి ముందు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 1925లోనే పౌర ఉమ్మడి స్మృతిని మొదటిసారిగా సమర్థించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్​ (లౌకిక) పార్టీగా లేదని, కేవలం ఒక నిర్దిష్ట సమాజానికి ప్రతినిధిగా మారిపోయిందని ఆరోపించారు.

ఇకపై అసెంబ్లీలో ‘ది యూనిఫామ్ సివిల్​ కోడ్, అసోం, 2026’పై అడిగిన ప్రశ్నలకు సీఎం హిమంత బిశ్వ శర్మ సమాధానం ఇస్తూ, “ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ చట్టం బీజేపీ లేదా ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాలపై ఆధారపడి లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 44 ఆధారంగానే రూపొందించాం. వాస్తవానికి యూసీసీకి పెద్ద చరిత్రే ఉంది. దీనిని 1925లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీయే డిమాండ్ చేసింది. 1937లో స్వయంగా జవహర్​లాల్ నెహ్రూ దీనిని ప్రవేశపెట్టాలని సూచించారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యూసీసీని హిందూ, క్రైస్తవ, గిరిజనుల కోణం నుంచి కాకుండా ఖురాన్​, షరియా కోణం ద్వారా చూస్తూ వ్యతిరేకిస్తోంది” అని విమర్శించారు