పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రకృతి విపత్తుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వయస్సులో పనిలేదని ఓ అమ్మాయి నిరూపించింది. ఈశాన్య భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఆ అమ్మాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లది మంది విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎందుకంటే మన దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీబీఎస్ఈ ఇంగ్లీష్ లిటరేచర్ పాఠ్యాంశాల్లో ఆ చిన్నారి జీవిత కథకు చోటు దక్కింది. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ పూర్తి కథనం చదవండి.
మణిపుర్, ఇంఫాల్‌లోని బషిఖోంగ్లో జన్మించిన లిసిప్రియా కాంగుజం 6 ఏళ్ల చిరుప్రాయం నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేయడం ప్రారంభించింది. ఆమె 2018లో తన ఆరేళ్ల వయస్సులోనే మంగోలియాలో జరిగిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) విపత్తు నిర్వహణ సదస్సుకు హాజరైంది. అదే సంవత్సరం పిల్లలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ‘చైల్డ్ మూవ్మెంట్’ అనే సంస్థను స్థాపించింది. 2019లో దేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి కఠినమైన పర్యావరణ చట్టాలు తీసుకురావాలని కోరుతూ పార్లమెంట్ ముందు ఒంటరిగా నిరసన తెలిపి వార్తల్లో నిలిచింది. అదే ఏడాది స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన ఐరాస వాతావరణ సదస్సు (సీఓపీ25)లో ప్రసంగించింది.
2023లో దుబాయ్‌లో జరిగిన సీఓపీ28 సదస్సు వేదికపైకి అకస్మాత్తుగా దూసుకువచ్చి ‘భూమిని కాపాడండి, శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆపండి’ అనే ప్లకార్డుతో ధైర్యంగా నిరసన వ్యక్తం చేసింది. ఈ విధంగా ఆ చిన్నారి చాలా చిన్న వయస్సులోనే వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించింది. దేశీయంగానే కాకుండా, ప్రపంచ వేదికలపై ధైర్యంగా తన గళం విప్పి పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న భారతదేశపు (14 ఏళ్లు) అత్యంత పిన్న వయస్కురాలైన పర్యావరణవేత్తగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ ఐదో తరగతి ఇంగ్లీష్ టెక్ట్స్ బుక్‌లో ఆమె జీవిత కథను పాఠ్యాంశంగా పొందుపరిచింది. ఇప్పటికే లిసిప్రియా కాంగుజం పాఠ్యాంశాన్ని నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ 2020) ఫ్రేమ్‌వర్క్ ప్రకారం 4, 7 తరగతుల కరిక్యులమ్‌లో చేర్చారు. అంతేకాదు పలు విశ్వవిద్యాలయాల కోర్సుల్లోనూ లిసిప్రియా సాధించిన విజయాలను పాఠాలుగా చేర్చారు.
ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం
లిసిప్రియ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, తన జీవిత కథను సీబీఎస్ఈ 5 తరగతి పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాని పేర్కొని, ఎంతో భావోద్వేగానికి లోనైంది. “భారతదేశం అంతటా, ఐదో తరగతి సీబీఎస్ఈ ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకంలో నా జీవిత కథను చదువుతుండడం నాకు దక్కిన అతిపెద్ద గౌరవం. దీనిని నేను ఎంతో వినమ్రంగా స్వీకరిస్తున్నాను. నూతన విద్యా విధానం 2020 ప్రకారం, ఇప్పటికే 4, 7 తరగతులతోపాటు, పలు యూనివర్సిటీల సిలబస్‌లో భాగమైంది. ఒక చిన్న గ్రామం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న క్లాస్‌రూమ్‌ల వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం నా ఒక్కదాని కథ మాత్రమే కాదు. సమాజంలో మార్పు తీసుకురావడానికి వయస్సు ఎప్పుడూ ఒక అడ్డంకి కాదనే నమ్మకాన్ని, సందేశాన్ని ఇది ప్రతి బిడ్డకూ అందిస్తుంది” అని తన మనస్సులోని మాటను చెప్పింది. మరోవైపు, ఇలాంటి నిజజీవిత స్ఫూర్తిదాయక కథలను పాఠ్యాంశాలుగా మార్చడం వల్ల విద్యార్థుల్లో చిన్నతనం నుంచే సామాజిక స్పృహ, ప్రకృతిపై బాధ్యత పెరుగుతాయని విద్యావేత్తలు, సామాజిక విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు మెరుగైన భవిష్యత్తు నిర్మణానికి దోహదపడేలా యువతను పోత్సహిస్తుందని విశ్వసిస్తున్నారు.





