News

ఆలయాల్లో సేవకు భక్తులకు అవకాశం

7views

తిరుమలలో శ్రీవారి సేవకుల మాదిరిగా విజయవాడ దుర్గమ్మ, శ్రీశైల మల్లన్న, సింహాద్రి అప్పన్న, అన్నవరం సత్యనారాయణస్వామి.. తదితర ఆలయాల్లోనూ వాలంటీర్లుగా సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలోని ఏడు ప్రధాన, 15 ముఖ్య ఆలయాల్లో పర్వదినాలు, పండుగలు, ఉత్సవాల వేళ వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటోంది. క్యూలైన్లలో భక్తుల రద్దీ నియంత్రణ, మంచినీరు, మజ్జిగ అందించడం, మధ్యాహ్నం అన్నప్రసాదం వడ్డించడం, పూలదండల తయారీ, ఆలయ ప్రాంగణం అలంకరణ, హుండీ కానుకల లెక్కింపు వంటి సేవలు వాలంటీర్లు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఆయా ఆలయాల వెబ్‌సైట్లను సందర్శించి ‘వాలంటీర్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి, ప్రాథమిక వివరాలు, ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. వాటిని పరిశీలించాక దేవస్థానం అధికారులు సమ్మతి తెలిపి, గుర్తింపు కార్డు జారీచేస్తారు. నేరుగా ఆలయానికి వెళ్లి కూడా పేరు నమోదు చేసుకోవచ్చు.

ఇప్పటికే శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో అత్యధికంగా 14,920 మంది వాలంటీర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. అన్నవరం-10,583, విజయవాడ దుర్గగుడి-10,283, ద్వారకాతిరుమల-9,386, శ్రీకాళహస్తి-6,122, కాణిపాకం-4,340, సింహాచలం-3,800 మంది చొప్పున మొత్తంగా 7 ప్రధాన ఆలయాల పరిధిలో 59,704 మంది పేర్లు ఇచ్చారు. వీటిలో 10 వేల కంటే ఎక్కువ మంది సేవకులను నియమించుకోనున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని మరో 15 ముఖ్య ఆలయాల్లోనూ ఒక్కోచోట 5 వేల మందికి అవకాశం కల్పించనున్నారు. రద్దీ రోజులు, ప్రత్యేక పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా తమ ఆలయానికి ఎంతమంది వాలంటీర్లు అవసరమో పేర్కొంటూ దేవస్థానం స్లాట్‌ విడుదల చేస్తుంది. దీనిపై ఆ ఆలయ పరిధిలోని వాలంటీర్లకు సమాచారం వెళ్తుంది. వాలంటీర్లు తమ స్లాట్‌ను ఖరారు చేస్తే, ఆయా రోజులకు వర్తించేలా వారికి గుర్తింపు కార్డు ఇస్తారు. మహిళా సేవకులు కాషాయ రంగు శాలువా, పురుషులు కండువాతో పాటు గుర్తింపు కార్డును మెడలో వేసుకోవాలి. వాలంటీర్లకు స్వామి, అమ్మవార్ల దర్శనంతో పాటు ప్రసాదం అందజేస్తారు. భోజనం, వసతి కల్పిస్తారు.