
జమ్మూ–కాశ్మీర్ లోని పూంఛ్ లో గత 21 సంవత్సరాలుగా బజరంగ్ దళ్ నిరంతరంగా నిర్వహిస్తున్న “సాహసీ యాత్ర” ఈ ఏడాది కూడా ఆధ్యాత్మిక ఉత్సాహంతో ప్రారంభం కానుంది. ఈ యాత్ర ద్వారా భక్తులు శ్రీ బాబా బుద్ఢా అమర్‌నాథ్ స్వామి ఆలయం దర్శనం పొందుతున్నారు.
ఈ కార్యక్రమంపై విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే మాట్లాడుతూ, 1990లలో లోయ ప్రాంతంలో జిహాదీ ఉగ్రవాదం, సరిహద్దు కాల్పుల కారణంగా ఈ పవిత్ర యాత్ర దాదాపు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అయితే బజరంగ్ దళ్ పునరుద్ధరణ తర్వాత ఈ యాత్ర మళ్లీ కొనసాగుతూ భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
మిలింద్ పరాండే మాట్లాడుతూ, “శ్రీ బాబా బుద్ఢా అమర్‌నాథ్ సాహసీ యాత్ర” కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా జాతీయ సమైక్యతకు దోహదపడుతోందని తెలిపారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికుల పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచే యాత్రగా కూడా ఇది నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ యాత్ర ద్వారా ప్రాంతంలో హిందూ పుణ్యక్షేత్రాల పరిరక్షణకు తోడ్పాటు లభిస్తోందని, స్థానిక హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారని తెలిపారు.
ఈ ఏడాది యాత్ర ఆగస్టు 16 నుంచి ఆగస్టు 27 వరకు జరుగనుందని నిర్వాహకులు ప్రకటించారు. ఆగస్టు 16 సాయంత్రం జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద ప్రారంభోత్సవం జరుగనుంది. అనంతరం యాత్రికులు పూంఛ్‌కు బయలుదేరి దర్శన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
యాత్ర షెడ్యూల్ ప్రకారం పూంఛ్ చేరుకుని బాబా బుద్ఢా అమర్‌నాథ్ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో రాజౌరి, సుందర్‌బని మీదుగా ప్రయాణించి శివఖోరి దర్శనం కూడా జరుగనుంది. చివరికి కత్రాలో యాత్ర ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ప్రతిరోజూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రిక బృందాలు ఈ విధానంలో దర్శనం నిర్వహిస్తాయని సమాచారం. 2005లో బజరంగ్ దళ్ ఈ యాత్రను పునరుద్ధరించిన తర్వాత భక్తుల స్పందన గణనీయంగా పెరిగిందని కూడా ఆయన పేర్కొన్నారు.
యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా “Budha Amarnath Portal” అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా భక్తులు యాత్రకు నమోదు చేసుకోవచ్చని వారు వివరించారు.





