News

పాకాల మండలంలో రైతు పొలంలో వెలుగుచూసిన శ్రీదుర్గాదేవి విగ్రహం

6views

చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం ఇరంగారిపల్లి గ్రామ పరిసరాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దామలచెరువు–నేండ్రగుంట రహదారి ఆనుకుని ఉన్న ఓ రైతు పొలంలో జేసీబీతో తవ్వకాలు చేపడుతుండగా సుమారు ఐదు అడుగుల ఎత్తైన సింహవాహిని శ్రీదుర్గాదేవి విగ్రహం బయటపడింది.

ఈ విషయం తెలిసిన వెంటనే పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు భక్తులు ఈ విగ్రహాన్ని దైవ సంకేతంగా భావిస్తూ హారతులు సమర్పించారు.

అయితే, విగ్రహం ఆకృతి, పీఠం నిర్మాణాన్ని పరిశీలించిన కొందరు స్థానికులు మరియు శిల్పకళపై అవగాహన ఉన్న వారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పురాతన విగ్రహాలపై కనిపించే ఉలితో చెక్కిన ఆనవాళ్లు లేకపోవడం, శిల్పం నిర్మాణ శైలి ఆధునిక యంత్రాలతో చెక్కినట్టుగా కనిపించడం వల్ల ఇది ఇటీవల కాలంలో తయారుచేసిన విగ్రహం అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఈ విగ్రహం నిజంగా పురాతనదా? లేక ఆధునిక కాలంలో రూపొందించబడిందా? అనే అంశంపై స్పష్టత కోసం పురావస్తు శాఖ అధికారులు లేదా శిల్ప నిపుణులు పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.