
అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సిఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) స్పష్టం చేసింది. దీనిపై తాజాగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పందించారు. యూఎస్‌లో తాత్కాలిక వీసాలపై ఉంటున్న భారతీయులు ఇకనైనా స్వదేశానికి తిరిగి రావాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
‘అమెరికాలో వీసాలపై ఉన్న భారతీయులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి స్వదేశానికి తిరిగి రండి. వెనక్కి రావడం అనే నిర్ణయం మీకు కష్టంగా అనిపించినా.. ఆత్మగౌరవమే మీ మార్గాన్ని నిర్దేశించాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా భారత్‌కు గర్వకారణంగా నిలుద్దాం అని పిలుపునిచ్చారు. కాగా.. అమెరికాలోని భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలంటూ శ్రీధర్ వెంబు కోరడం ఇదేం మొదటిసారి కాదు. భారత్‌కు మీ ప్రతిభ అవసరం అంటూ గత నెలలో కూడా ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు.
గ్రీన్‌కార్డు ప్రక్రియలో ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన ఈ కొత్త మార్పుపై పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హామన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘ఇప్పుడు ఏఐ పరిశోధకులు, ఉద్యోగులు, విద్యార్థులు దేశాన్ని విడిచివెళ్లాలా?. గ్రీన్‌కార్డ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు వేచి ఉండాలా?. ఇది టెక్, వ్యాపార సంస్థలతో సహా మొత్తం అమెరికాకే హానికరమైన చర్య’ అని అన్నారు. గతంలో గూగుల్‌లో కీలక బృందానికి నాయకత్వం వహించిన ఏఐ నిపుణుడు ఆండ్రూ ఎన్గ్.. ఈ కొత్త నిబంధనను తప్పుబట్టారు. దీని కారణంగా అమెరికాలో వైద్యులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐలో అమెరికా పోటీతత్వాన్ని కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించారు.





