News

బాదామి గుహాలయంలో బూట్లతో కూర్చున్న యువతి అభ్యంతరం వ్యక్తం చేసిన హిందూ భక్తులు

6views

కర్ణాటక బాగల్కోట్ జిల్లాలోని చారిత్రాత్మక బాదామి గుహాలయాల జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ ప్రాంగణంలో బూట్లు వేసుకుని కూర్చున్న ఒక యువతిని పలువురు హిందూ భక్తులు, పర్యాటకులు మందలించిన వీడియో వైరల్ అవుతోంది.

సమాచారం ప్రకారం, కొన్ని రోజుల క్రితం బాదామి గుహాలయాలను సందర్శించిన ఒక ముస్లిం యువతి ఆలయ ప్రాంతంలో బూట్లు తొలగించకుండా కూర్చుని కనిపించింది. దీనిని గమనించిన ఒక మహిళా పర్యాటకురాలు ఆమెను ప్రశ్నిస్తూ, “ఇది పవిత్రమైన దేవాలయ ప్రదేశం. బూట్లతో లోపలికి రావడం ద్వారా హిందువుల మతపరమైన భావాలను ఎందుకు దెబ్బతీస్తున్నారు?” అని అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ ఘటనతో అక్కడ కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. తాను అక్కడి సంస్థలో ఉద్యోగినని ఆ యువతి చెప్పినట్లు సమాచారం. వీడియోలో ఆమె మెడలో గుర్తింపు కార్డు కూడా కనిపించింది. అయితే ఇతర పర్యాటకులు కూడా ఆలయ పవిత్రతను గౌరవించాలని, స్థానిక ఆచారాలను పాటించాలని ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది.

హిందూ భక్తులు ఆలయాలలో సంప్రదాయాలు, నియమాలు పాటించడం ప్రతి సందర్శకుడి బాధ్యత అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా దేవాలయ ప్రాంగణంలో బూట్లు తొలగించడం హిందూ ఆచారాలలో భాగమని వారు గుర్తుచేశారు.

బాదామి గుహాలయాలు చాళుక్యుల కాలానికి చెందిన చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల కట్టడాలు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుహాలయాలు అద్భుతమైన శిల్పకళ, దైవిక వాతావరణానికి ప్రసిద్ధి చెందాయి. హిందూ భక్తులకు ఇవి కేవలం పర్యాటక కేంద్రాలు మాత్రమే కాకుండా పవిత్ర ఆరాధనా స్థలాలుగా కూడా భావించబడుతున్నాయి.