ArticlesNews

మొక్కలకు సానుకూల తరంగాలు- రైతు ‘యోగిక వ్యవసాయం’

7views

సంప్రదాయ వ్యవసాయం, విస్తృత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, పోడు వ్యవసాయం గురించి మనమంతా విన్నాం. అయితే ‘యోగిక’ వ్యవసాయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ‘యోగిక’ వ్యవసాయంలో భాగంగా రైతులు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 20 నుంచి 30 నిమిషాల పాటు పొలం మధ్యలో కూర్చొని రాజయోగ ధ్యానం చేస్తారు. తమ పొలానికి, మొక్కలకు శాంతి, శక్తి లభించాలని కోరుకుంటారు. ఇంకొందరు రైతులు చిన్న లౌడ్ స్పీకర్ల ద్వారా పొలమంతా వినబడేలా ధ్యాన గీతాలను ప్లే చేస్తారు. రైతు శ్రీకాంత్ యాదవ్ 2025 ఫిబ్రవరిలో 7.5 ఎకరాల భూమిలో 7 రకాల పంటలతో యోగిక వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. దీని ఎఫెక్ట్‌తో వచ్చే ఏడాది రూ.70 లక్షల దాకా సంపాదిస్తానని ఆయన అంటున్నారు. యోగిక వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే ఫార్ములా ఏమిటి ? పొలం కోసం, పంటల కోసం శ్రీకాంత్ యాదవ్ ఎప్పుడెప్పుడు ఎలాంటి యోగాసనాలు వేస్తున్నారు ? యోగాసనాలతో పంటలు ప్రభావితం అవుతాయా ? వ్యవసాయ నిపుణులు ఏమంటున్నారు ? ఈ కథనంలో తెలుసుకుందాం.

తొలిసారిగా అక్కడే చూశారు
రైతు శ్రీకాంత్ యాదవ్, బిహార్‌లోని గయ జిల్లా షేర్‌ఘాటి బ్లాక్‌లోని గోపాల్‌పూర్ గ్రామస్థుడు. ఈయనకు గోపాల్‌పూర్ సమీపంలోని చిలం గ్రామంలో 7.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2024లో ఆధ్యాత్మిక శిక్షణ కోసం రాజస్థాన్‌లోని మౌంట్ అబుకు శ్రీకాంత్ వెళ్లారు. ఆయన తొలిసారిగా యోగిక వ్యవసాయాన్ని అక్కడే చూశారు. మౌంట్ అబులోనే ఒక సంవత్సరం పాటు సేంద్రియ, సమ్మేళన వ్యవసాయంలో శిక్షణ పొందారు. అక్కడ పొందిన ప్రేరణతో, గయ జిల్లాకు తిరిగొచ్చిన తర్వాత బిహార్ ప్రభుత్వ ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించారు. యోగిక వ్యవసాయంపై వారి నుంచీ సలహాలు, సూచనలను తీసుకున్నారు. ఈ వివరాలన్నీ తెలుసుకున్నాక యోగిక వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయంతో కలిపి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని శ్రీకాంత్ యాదవ్ గ్రహించారు. వాస్తవానికి అంతకుముందు నుంచే సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఈయన అనుసరిస్తున్నారు. తన వద్దనున్న 10 ఆవుల పేడతో వర్మీ కంపోస్టును తయారు చేసుకుంటున్నారు. తదుపరిగా దీనికి యోగిక పద్ధతులను జోడించుకున్నారు.

అంతర పంటల సాగుతో భరోసా
2025 ఫిబ్రవరిలో చిలం గ్రామంలోని కొంత వ్యవసాయ భూమిలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను శ్రీకాంత్ యాదవ్ నాటారు. ఆ మొక్కల మధ్యనున్న ఖాళీ ప్రదేశాల్లో కొత్తిమీర, పాలకూర, బంగాళదుంప వంటి పంటలను వేశారు. ఆయన పొలంలోని ఇంకొంత భాగంలో అప్పటికే అరటి, మామిడి తోటలు ఉన్నాయి. దాదాపు అర ఎకరం విస్తీర్ణంలో ఆధునిక పాలీహౌస్‌లో మహారాష్ట్రకు చెందిన ప్రత్యేకమైన నూన్ హన్స్ రకం మిరపకాయలను సైతం శ్రీకాంత్ సాగు చేస్తున్నారు. ఏదైనా కారణంతో ఒక పంటలో నష్టపోయినా, ఆ లోటును మరో పంట భర్తీ చేస్తుందనే భరోసాతోనే అంతరపంటల సాగుకు ఆయన మొగ్గు చూపుతున్నారు.ఈ పంటల సాగుకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించడాన్ని కొనసాగిస్తూనే, వాటికి యోగిక వ్యవసాయ మెళకువలను జోడించారు. తద్వారా గయ జిల్లాలో యోగిక వ్యవసాయాన్ని చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు.

యోగిక వ్యవసాయం – ఎలా ?

  • పొలాల్లో పూజలు చేసే సంప్రదాయం భారతీయ వ్యవసాయ రంగంలో చాలా శతాబ్దాలుగా ఉందని రైతు శ్రీకాంత్ యాదవ్ గుర్తుచేశారు. పూర్వీకులు పొలాలు దున్నేటప్పుడు, విత్తనాలు నాటేటప్పుడు, పంట కోసేటప్పుడు, పంటను కొట్టం నుంచి ఇంటికి తెచ్చేటప్పుడు, అక్షయ తృతీయ వంటి శుభ నక్షత్రాల రోజున పొలాల్లో పూజలు చేసేవారని తెలిపారు. ధ్యానం అనేది ఆ పూజా సంప్రదాయానికి ఆధునిక రూపమని ఆయన చెప్పారు.
  • రైతు శ్రీకాంత్ రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపు తన పొలంలోని పంటల మధ్య కూర్చొని రాజయోగ ధ్యానం చేస్తారు. ధ్యానం ద్వారా భగవంతుడి దివ్య కాంతి తన పంటలపై పడుతుందని ఆయన తెలిపారు. దీనివల్ల పంటలు వేగంగా పెరుగుతాయని చెప్పారు. ఇది ఊహ కాదని, నిజమైన ప్రభావమన్నారు.
  • ఒక రైతు తన పంటను సానుకూల ఆలోచనలతో చూస్తూ, దేవుడిని గుర్తు చేసుకుంటే ఆ ప్రభావం పంటల పెరుగుదలపై పడుతుందని శ్రీకాంత్ యాదవ్ చెప్పారు.
  • రాజయోగ ధ్యానం ప్రభావంతో కొద్ది నెలల్లోనే మిరప, పాలకూర, ఇతర పంటలలో మెరుగైన పెరుగుదలను తాను చూశానని శ్రీకాంత్ పేర్కొన్నారు.
  • రాజస్థాన్‌లోని మౌంట్ అబులో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో యోగిక వ్యవసాయ మెళకువలను నేర్చుకున్నట్లు రైతు శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. ఈ వ్యవసాయ పద్ధతిని గయ జిల్లాతో పాటు బిహార్ అంతటా వ్యాప్తి చేయాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
  • రూ.70 లక్షల దాకా సంపాదిస్తాను
    “నేను ప్రస్తుతం యోగిక వ్యవసాయంలో ప్రారంభ దశలోనే ఉన్నాను. అయినప్పటికీ నాకు ప్రస్తుతానికి ఏటా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. కానీ పంట దిగుబడి పెరిగే కొద్దీ, నా ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది. వచ్చే ఏడాది నాటికి నా వార్షిక ఆదాయం రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల రేంజుకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రైతులు సరైన ప్రణాళిక, సేంద్రియ పద్ధతులతో యోగిక వ్యవసాయాన్ని చేస్తే లాభాల వర్షం కురవడం ఖాయం. సేంద్రియ వ్యవసాయం, యోగిక వ్యవసాయం ఈ రెండింటి ఖర్చులు సున్నా. వేప, ధతూర, గోమూత్రం, అక్వాన్, కరంజ వంటి సహజ పదార్ధాలతో పురుగుమందులను నేనే తయారు చేసుకుంటాను. దీనివల్ల రసాయన మందులను కొనాల్సిన అవసరం ఉండదు. సేంద్రియ పురుగుమందులతో నేలసారం దెబ్బతినదు. కచ్చితంగా ఈ రెండు వ్యవసాయ పద్ధతుల కలయికతో రైతులు అనేక రెట్ల లాభాలను గడించొచ్చు. వ్యవసాయంలో ఆధ్యాత్మికత, సేంద్రియ ఎరువులు రెండూ ముఖ్యమైనవే” అని రైతు శ్రీకాంత్ యాదవ్ చెప్పుకొచ్చారు.

    శాస్త్రీయంగా నిరూపితం కాలేదు
    “సేంద్రియ వ్యవసాయం కచ్చితంగా ప్రయోజనకరమైందే. దానితో పంటల నాణ్యత పెరుగుతుంది. ఇక పొలాల్లో యోగ, ధ్యానం చేస్తే రైతుల మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వారిలో ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. రైతు మరింత సానుకూల దృక్పథంతో పనిచేస్తాడు. పంటల పెరుగుదలపై యోగా, ధ్యానం యొక్క ప్రత్యక్ష ప్రభావం అనేది ఇంకా శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. మొక్కలు, చెట్లపై సంగీతం ప్రభావం ఉంటుందని గతంలో గుర్తించారు. అయితే ధ్యానం వల్ల మొక్కలపై ప్రభావం పడుతుందనే దానిపై సరిపడా శాస్త్రీయ ఆధారాలేవీ లేవు. యోగిక వ్యవసాయాన్ని ఒక రకమైన విశ్వాసంగా చూడొచ్చు. ఒకవేళ ధ్యానంతో పాటు సంగీతం, సానుకూల వాతావరణం అనేది ఉంటే పంటలపై కొంతమేర ప్రభావం పడే సూచనలు ఉంటాయి” అని బోధగయలోని మగధ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అమిత్ కుమార్ సింగ్ తెలిపారు.