ArticlesNews

భావిత తరాలకు సనాతన ధర్మాన్ని బోధిస్తున్న మహిళ

6views

ఒకప్పుడు విద్య అనగానే గురుకులాలే గుర్తుకు వచ్చేవి. అక్కడ విద్యార్థులంతా ఒక చెట్టు కింద కూర్చొని, గురువు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవారు. కానీ ఇప్పుడు చాలామంది చిన్నారులు పుస్తకాల కంటే మొబైల్ ఫోన్లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు పిల్లలకు చేరవేయాలనే లక్ష్యంతో ఒడిశాకు చెందిన ఓ మహిళ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆధునిక సదుపాయాలు, ఆన్‌లైన్ తరగతులను పక్కనపెట్టి, పూర్వకాల గురుకుల విధానాన్నే తిరిగి తీసుకొచ్చింది. చెట్టు కింద పిల్లలను కూర్చోబెట్టి భగవద్గీత శ్లోకాలు, సంస్కార బోధన చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రత్యేక గురుకులం స్థానికులను ఆకట్టుకుంటోంది. సనాతన ధర్మాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలనే సంకల్పంతో ప్రారంభమైన ఈ గురుకులం ఎక్కడ ఉంది? ఆ మహిళ ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్రపారా బ్లాక్, ధోల్ పంచాయతీ, నల్పరి గ్రామానికి చెందిన 38 ఏళ్ల సంధ్యారాణి బరాల్, ప్రస్తుతం పట్టాముండై తహసీల్ పరిధిలోని బదాములాబసంత్​లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ)గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, సమాజంలో సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి, పిల్లలలో ధర్మంపట్ల ఆసక్తిని పెంపొందించడానికి ఆమె ఈ వినూత్నమైన అడుగు వేశారు. భవిష్యత్ తరాలు గీత విలువను అర్థం చేసుకుంటే, సమాజంలో నైతిక విలువలు, సానుకూల ఆలోచనా విధానం మరింత బలంగా ఉంటాయని ఆమె నమ్ముతున్నారు. అందుకే ‘ఈ డిజిటల్ యుగంలో, చెట్టు కింద ఏర్పాటు చేసిన ఈ గీతా తరగతులు పిల్లలను బాగా ఆకర్షిస్తున్నాయి. దీని ద్వారా వారు సనాతన ధర్మంపై ఆసక్తిని పెంపొందించుకోవడమే కాకుండా, జీవితంలోని వివిధ అంశాలపై జ్ఞానాన్ని పొందగలుగుతున్నారని’ ఆమె తెలిపారు.

గురుకులం తరహాలో విద్య
గ్రామ మఠం ఆవరణలో చెట్ల కింద జరుగుతున్న ఈ భగవద్గీత తరగతిని చూస్తే ఎవరికైనా పాత గురుకుల సంప్రదాయం గుర్తుకు వస్తుంది. పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో, చందనపు తిలకం పెట్టుకుని, గీతా శ్లోకాలను, వాటి అర్థాలను నేర్చుకుంటున్నారు. ఇక్కడ కేవలం శ్లోకాలను పఠించడమే కాకుండా, జీవితంలో భగవద్గీత అనువర్తనం, మానవ కర్తవ్యాలు, నీతి, జీవన తత్వం గురించి కూడా పిల్లలకు బోధిస్తా’ అని సంధ్యారాణి పేర్కొన్నారు.

“నేను చిన్నతనంలోనే భగవద్గీత నుంచి చాలా నేర్చుకున్నాను. మేము ప్రాథమిక అక్షరమాలను నేర్చుకోగానే, మా నాన్న మా చేతికి భగవద్గీతను ఇచ్చారు. ఆ వయసులో మాకు దాని అర్థం తెలియకపోయినా, కాలక్రమేణా ఆ సంస్కృత శ్లోకాలు మా జీవితాన్ని చక్కగా జీవించడానికి సహాయపడ్డాయి. గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక వ్యక్తి తనకు తానే ఎలా శత్రువు కాగలడో వివరిస్తాడు. మన ఎదుగుదల, పతనం అనేవి మన చేతుల్లోనే ఉన్నాయని ఇది బోధిస్తుంది. కేవలం బట్టీ పట్టడం కంటే వారు దానిని ఎలా అర్థం చేసుకుని, తమ జీవితాల్లో ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేదే ముఖ్యం. నేను శ్లోకాల సరైన ఉచ్చారణపై పట్టుబడతాను. నేను మొదట వాటి అర్థాలను వివరించి, ఆ బోధనలను వారు తమ జీవితాల్లో ఎలా అమలు చేయాలో సహాయపడతాను. పిల్లలకు ఇలాంటి ముఖ్యమైన పాఠాలు మరెక్కడా దొరకవు కాబట్టి తల్లిదండ్రులు కూడా సంతోషంగా తమ పిల్లలను ఇక్కడికి పంపుతున్నారు” అని సంధ్యారాణి పేర్కొన్నారు.

ద్వేషపూరిత వ్యాఖ్యలు మనుషులను విభజిస్తాయ్
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇటీవల రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “సనాతన ధర్మాన్ని స్వీకరించమని ఎవరినీ బలవంతం చేయనప్పుడు లేదా ప్రలోభపెట్టనప్పుడు, దానిని ఎవరైనా ఎలా నాశనం చేయగలరు? రాజకీయ నేతలు చేసే ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా విద్వేషపూరితమైనవి, అవి ప్రజలను విభజిస్తాయి. గీత ఇతరులను కూడా ఆదరించాలని బోధిస్తుంది” అని ఆమె స్పష్టం చేశారు.

కాగా, ఇక్కడి పిల్లలు గత రెండు సంవత్సరాలుగా ప్రతి వారం గీతను పఠిస్తున్నారు. ఏప్రిల్ 20 నుంచి క్రమం తప్పని గీతా తరగతులు ప్రారంభమయ్యాయి. రోజూ ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత, మధ్యాహ్నం సమయంలో పిల్లలకు సంధ్యారాణి బోధిస్తారు. అలాగే సెలవుల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆసక్తితో ఇక్కడికి పంపిస్తున్నారు. మొదట 20 మందితో ప్రారంభమైన ఈ తరగతులకు, ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు.

సంధ్యారాణి చేపట్టిన ఈ విశిష్టమైన కృషిని ఆ ప్రాంత ప్రజలు కూడా అభినందిస్తున్నారు. దీనితో విద్యాభ్యాసంతో పాటు, ఆధ్యాత్మిక, నైతిక విద్య కూడా భవిష్యత్ తరాలను మంచి మనుషులుగా తీర్చిదిద్దుతుందని సంధ్యారాణి ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లలు మొబైల్, వర్చువల్ ప్రపంచంతో తీరిక లేకుండా గడుపుతున్న ఈ డిజిటల్ యుగంలో, వారు ఒక చెట్టు కింద కూర్చుని గీతను పఠించడం చూస్తే ప్రజలకు పాత గురుకుల సంప్రదాయం గుర్తుకు వస్తుందని అన్నారు. గ్రామంలోని ఈ చిన్న గీతా విద్యా కేంద్రం ఇప్పుడు మన సంస్కృతి, విలువలకు కేంద్రంగా కూడా మారిందని చెప్పారు.