News

గోవుల అక్రమ రవాణాపై డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

7views

తెలంగాణలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు ఎమ్మెల్యే బహిరంగ లేఖ రాశారు. గోవులతో వెళ్తున్న లారీని గో రక్షక్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారని.. దీంతో ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడకు చేరుకొని ఆ లారీని తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని.. హిందువైనా, ఎంఐఎం నాయకులైనా ఒకే విధంగా చూడాలని అన్నారు.

గోవుల అక్రమ రవాణా చేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు.. రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా పని చేయాలని తెలిపారు. హిందువులపై మాత్రమే చర్యలు తీసుకుంటే ప్రజల్లో అనుమానాలు వస్తాయన్నారు. గోమాతను కాపాడాలని చెప్పే ప్రభుత్వం.. అక్రమ రవాణాను ఎందుకు ఆపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఎవరైనా చట్టం ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ డీజీపీ వెంటనే ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ లేఖలో స్పష్టం చేశారు.