ArticlesNews

అనుబంధాలు.. ఆదర్శాలు హిందూ కుటుంబ వ్యవస్థ

7views

కుటుంబం అంటే అదొక పవిత్ర వ్యవస్థ. ఇంట్లో సభ్యులు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవించినప్పుడు కొండంత బలం చేకూరుతుంది. ఆసరా లభిస్తుంది, ఆనందం సొంతమవుతుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం- ఈ నాలుగు ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ముఖ్యమైందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ‘యథా వాయుం సమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః, తథా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వ ఆశ్రమాః’

గాలిని ఆధారంగా చేసుకుని ప్రాణులు జీవిస్తున్నట్టుగా గృహస్థాశ్రమాన్ని ఆధారంగా చేసుకుని మిగిలిన ఆశ్రమాలుంటాయి. అంటే సమాజానికి కుటుంబమే పోషకశక్తి. ధర్మశాస్త్రాల ప్రకారం, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే సభ్యుల మధ్య ప్రేమ మాత్రమే కాదు, ధర్మపాలన.. అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అత్యంత అవసరం. తక్కిన మూడు ఆశ్రమాల వారు జీవనం కోసం గృహస్థుడిపైనే ఆధారపడతారు. వివాహంతో కుటుంబం ఏర్పడుతుంది. తద్వారా వంశం, సమాజం, ధర్మం నిలబడతాయి. ధర్మశాస్త్రాలు పేర్కొన్న సూత్రాలను అనుసరిస్తూ ఆదర్శంగా నిలిచిన కుటుంబాలు మన పురాణేతిహాసాల్లో అనేకం ఉన్నాయి. ఆ మహనీయులు అనుసరణీయులు.

ఐకమత్యమే బలం
‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని చాటిచెప్పింది మహా భారతం. కుంతీదేవి తన ఐదుగురు కుమారులను పెంచిన తీరు అపురూపం. పిల్లల్ని ఎలా పెంచాలనే దానికి ఆమె
పెంపకం ఆదర్శం. అలా ధర్మబద్ధంగా, శక్తిమంతంగా పెంచినందువల్లనే.. ఎంతటి కష్టాలు ఎదురైనా వారు భీతిల్లలేదు, పారిపోలేదు, విడిపోలేదు. తల్లి మాట జవదాటకూడదన్న సూత్రంతో ఆ ఐదుగురు అన్నదమ్ములు ఐకమత్యాన్ని పాటించి ఆదర్శవంతులుగా నిలిచారు. ధర్మరాజు అంటే తమ్ముళ్లకు అచంచల ప్రేమ, విశ్వాసం. పెద్దల పట్ల పిన్నలు అలా వినమ్రంగా, గౌరవంగా ఉంటేనే విజేతలుగా నిలుస్తారని స్పష్టమవుతుంది.

అంతులేని ప్రేమ
త్యాగానికి ప్రతిరూపం. ఆదర్శ కుటుంబం అనగానే మొదట గుర్తొచ్చేది రామాయణం. ఈ కుటుంబంలోని పాత్రలన్నీ ఉత్తమ లక్షణాలతో కనిపిస్తాయి. తండ్రికి ఇచ్చిన మాట కోసం
రాముడు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లాడు. పితృవాక్య పరిపాలనతో ఖ్యాతి చెందాడు. అనుబంధం, ఆత్మీయతలకు ప్రతీక లక్ష్మణుడు. అన్న వెంటే నీడలా వెళ్లాడు, వదినను తల్లిలా భావించాడు. కష్టసుఖాల్లో భర్త వెంటే ఉంటానని అడవికి బయల్దేరిన సీతమ్మ సహధర్మచారిణికి నిర్వచనమైంది, అందరికీ ఆదర్శమైంది. అన్నకు చెందాల్సిన రాజ్యం
తనకు వద్దని, రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి పాలించిన భరతుడు నిస్వార్థానికి మచ్చుతునక.

సమన్వయంతో సాగారు..
శివపార్వతులు ఆది దంపతులు. వాళ్లు సయోధ్యకు చిహ్నం. వీరి కుటుంబంలో వైవిధ్యం ఉన్నప్పటికీ అద్భుతమైన సమన్వయం కనిపిస్తుంది. శివుడి వాహనం ఎద్దు, పార్వతి వాహనం సింహం. కుమారస్వామి వాహనం నెమలి, వినాయకుడిది ఎలుక. శివుని మెడలో పాము.. అది నెమలికి ఆహారం. ఇన్ని పరస్పర విరుద్ధమైన స్వభావాలు ఉన్నా, వారి మధ్య కలహాలనేవి లేవు. కుటుంబంలో వ్యక్తుల అభిరుచులు వేరైనా సానుకూలంగా మెలగుతూ సమన్వయంతో సాగాలని తెలియజేస్తుంది వీరి ఆదర్శ జీవనం.

ధర్మాన్ని వీడలేదు..
హరిశ్చంద్ర మహారాజు, ఆయన భార్య చంద్రమతి, కుమారుడు లోహితాస్యుడు– వీరంతా ధర్మం కోసం ఎవరి పరిధిలో వారు అనేక కష్టాలు అనుభవించారు. అయినా అందరూ ఎంతో సంయమనంతో ఉన్నారు. రాజ్యం పోయి, అప్పుల పాలై, భార్యాబిడ్డలను అమ్ముకోవాల్సి వచ్చినా వారు ధర్మాన్ని వీడలేదు. ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవిస్తూ సత్యం కోసం ప్రాణాలకు తెగించారు. అలా ఓర్పుగా, నేర్పుగా ఉండాలన్నది వీరిచ్చే సందేశం.

సంతుష్టో భార్యయా భర్తా భర్త్రా భార్యా తథైవ చ
యస్మిన్నేవ నిత్యం కల్యాణం తత్ర వై ధ్రువమ్‌

భార్యతో భర్త, భర్తతో భార్య ఎల్లప్పుడూ ప్రేమగా ఉండాలి. అలా ఉన్నప్పుడు.. ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది- అన్నది ఈ శ్లోకానికి అర్థం. కుటుంబానికి పునాది ఆలుమగల అన్యోన్యత- అని చాటుతుంది ఈ ప్రసిద్ధ శ్లోకం. ధర్మబద్ధంగా సాగే కుటుంబం రాబోయే తరాలకు సంస్కారవంతులైన వ్యక్తులను అందిస్తూ భారతీయతను కాపాడుతుంది.

కుటుంబసభ్యులు ఐదు రకాల యజ్ఞాలు చేయాలని ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. దీనివల్ల ప్రశాంతత నెలకొంటుంది. వేదాలను చదవడం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా బ్రహ్మయజ్ఞం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ద్వారా పితృయజ్ఞం, దైవ ప్రార్థన, హోమం చేయడం ద్వారా దేవయజ్ఞం, పశుపక్ష్యాదులకు ఆహారం అందించడం ద్వారా భూతయజ్ఞం, ఇంటికి వచ్చినవారిని సత్కరించడం ద్వారా అతిథి యజ్ఞం నెరవేరతాయి.

అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సమ్మనాః
జాయా పత్యే మధుమతీం వాచం వదతు శాంతివామ్‌

అథర్వణ వేదంలోని ఈ సూక్తం కుటుంబసభ్యుల మధ్య ఉండాల్సిన బాంధవ్యాన్ని వివరిస్తుంది. తండ్రి ఆశయాలను పుత్రుడు అనుసరించాలి. తల్లితో ఏకమనస్కుడై ఉండాలి. భార్య తన భర్తతో ఎప్పుడూ మధురమైన, శాంతియుతమైన మాటలనే మాట్లాడాలి. తల్లీ తండ్రీ కొడుకూ కోడలూ ఇలా ఎవరికి వారు తమ ధర్మాలను పాటించాలి. అప్పుడు కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అనంతరం సామాజిక శాంతి.. తద్వారా విశ్వశాంతి పెంపొందుతాయన్నది ఇందులోని సూచన.