News

చైనా పర్యటనలో ట్రంప్ బృందం సంచలన నిర్ణయం.. గిఫ్ట్‌లనూ అక్కడే పారేసి వెళ్లిన వైనం!

26views

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బీజింగ్‌ పర్యటన ముగిసింది. అయితే ఆయన వెంట వెళ్లిన ఆ దేశ ప్రతినిధి బృందం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుగుపయనం అయ్యే సమయంలో వైట్‌ హౌస్‌ సిబ్బంది సహా ఇతర అధికారులు విమానం ఎక్కక ముందే తమ వస్తువులను పారేశారు. తాత్కాలిక మొబైల్స్‌ (ఒక్కసారి వాడిపడేసే బర్నర్‌ ఫోన్లు), చైనా అధికారులు ఇచ్చిన బహుమతులు, ఐడెంటిటీ కార్డుల వంటివి అందులో ఉన్నాయి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కే ముందే వాటన్నింటినీ డస్ట్‌బిన్‌లో వేయడం చర్చకు దారితీసింది.

గూఢచర్యం, సైబర్‌ భద్రత ముప్పుపై వాషింగ్టన్‌ ఆందోళనే ఇందుకు కారణమని తెలుస్తోంది. అందుకే కఠిన జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. పర్యటన ఆసాంతం అధికారులు కేవలం పరిమితకాలం వాడే ప్రత్యేక సాధనాలను మాత్రమే ఉపయోగించారు. వాటిని అక్కడే వదిలేయాలని వారికి ముందే స్పష్టమైన ఆదేశాలు అందాయి. లేదా స్వదేశానికి చేరిన వెంటనే పూర్తిగా నాశనం చేయాలని నిబంధనలు విధించారు. ఈ ఆంక్షలు ఎలక్ట్రానిక్‌ వస్తువులకే పరిమితం కాలేదు. బ్యాడ్జీలు, పిన్స్‌ లాంటి చైనా మూలాలు ఉన్న ఏ ఒక్క వస్తువునూ లోపలికి అనుమతించలేదు.

దీనికి సంబంధించిన వివరాలను ‘న్యూయార్క్‌ పోస్ట్‌’ రిపోర్టర్‌ ఒకరు ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. సున్నితమైన ప్రభుత్వ చర్చలు జరిగే సమయంలో నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా కనిపించే బహుమతుల ద్వారా కూడా సమాచారాన్ని దొంగిలించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వివాదాలకు తావు లేకుండా అమెరికా అత్యంత పకడ్బందీగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.