News

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

42views

వచ్చే ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల సమయంలో లక్షలాది మంది యాత్రికులు తరలిరావడంతో ఘాట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంటుంది. ఈ సమయంలో వీఐపీలు, ప్రత్యేక అతిథుల దర్శనం, పుణ్యస్నానాల కోసం సామాన్య యాత్రికులను కొంతసేపు ఘాట్ల వద్దకు రాకుండా అదుపు చేయాల్సి వస్తోంది. ఈ ఇబ్బందికర పరిస్థితిని అధిగమించేందుకు అధికారులు సరికొత్త ఆలోచన చేశారు.

కుంభమేళా తరహాలో ఏర్పాట్లు: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ కుంభమేళాలో అనుసరించిన విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా గోదావరి నదిలో అత్యాధునిక, విలాసవంతమైన ‘ప్లోటింగ్ బోట్ల’ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉన్నత స్థాయి అధికారులు, సినీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర రంగాల్లోని నిపుణులు, దేశ విదేశీ ప్రతినిధులు ఈ ఫ్లోటింగ్ బోట్లను వినియోగించుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల ఘాట్ల వద్ద రద్దీ తగ్గి సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పుణ్యస్నానాలు ఆచరించే వెసులుబాటు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

నదిలోనే ఫైవ్ స్టార్ సౌకర్యాలు: ఈ ఫ్లోటింగ్ బోట్లను పూర్తిగా ప్రత్యేక సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నారు. ప్రతి బోటులోనూ ఏసీతో కూడిన వ్యక్తిగత గదులు, అటాచ్డ్ బాత్రూమ్‌లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తారు. పుణ్యస్నానం కోసం నదిలోకి దిగేందుకు ప్రత్యేకంగా సురక్షితమైన మెట్లు, ప్లాట్‌ఫాంలు ఉంటాయి. స్నానం పూర్తయిన వెంటనే బోటులోని గదుల్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకునే సౌకర్యం కల్పిస్తారు. దీంతో వీఐపీలు ఎక్కువ సమయం నది ఒడ్డున వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, నదిలోనే ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంటుంది.

పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు: అంతేకాకుండా పుష్కర స్నానం అనంతరం పితృదేవతలకు తర్పణాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు బోట్లలోనే ప్రత్యేక స్థలాన్ని కేటాయించనున్నారు. అవసరమైన పూజా సామగ్రి, పురోహితుల సేవలను కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు చేస్తున్నారు. భద్రతా పరంగా బోటు చుట్టూ లైఫ్ గార్డులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని మోహరించనున్నారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల నిఘా, వైద్య సిబ్బంది, అంబులెన్స్ బోట్లను కూడా సిద్ధం చేస్తున్నారు

ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహణ: ఈ ఫ్లోటింగ్ బోట్ల నిర్వహణను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నాయి. ఒక్కో బోటులో 4 నుంచి 8 మంది వరకు బస చేసేలా డిజైన్లు రూపొందిస్తున్నారు. బుకింగ్ విధానం, ధరలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. పుష్కరాలకు వచ్చే వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, గోదావరి పుణ్యస్నానం ఆధ్యాత్మికతతో పాటు విలాసాన్ని కూడా అందించడమే తమ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.