గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన పవిత్ర భూమి గయ. ఆ తర్వాతే బిహార్‌లోని గయ ప్రాంతం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందింది. తాజాగా గయ జిల్లాలోని దుబ్బా గ్రామంలో దాదాపు 1200 సంవత్సరాల కిందటి భారీ పురాతన బౌద్ధ మఠం అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాల జాబితాలో మట్టిపాత్రలు, విగ్రహాలు, చిన్నసైజు బౌద్ధ స్థూపాలు ఉన్నాయి. ఈ అవశేషాలు బయటపడిన ప్రదేశంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు లభించడం విశేషం. బోధ్‌గయ నుంచి సారనాథ్‌కు వెళ్లే ప్రాచీన బౌద్ధ యాత్రా మార్గంలో ఉన్న దుబ్బా గ్రామంలో బయటపడ్డ పురాతన అవశేషాల ఆసక్తికర వివరాలతో కథనమిది.
నెల రోజుల అన్వేషణ – ఆ తర్వాతే తవ్వకాలు
ఈ చారిత్రక అవశేషాలను గుర్తించడం అనేది రాత్రికి రాత్రి జరగలేదు. ఇందుకోసం సుదీర్ఘ కసరత్తు జరిగింది. దుబ్బా గ్రామంలోని ఈ నిర్దిష్ట ప్రదేశంలో పురావస్తు పరిశోధన, తవ్వకాల కోసం తొలుత సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఆర్కియాలజీ (సీఏబీఏ) నుంచి లైసెన్స్ తీసుకున్నారు. బోధ్‌గయలో ఉన్న మగధ విశ్వవిద్యాలయంలోని ప్రాచీన భారత, ఆసియా అధ్యయన విభాగం బృందానికి ఈ లైసెన్స్ లభించింది. ఆ వెంటనే మగధ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యుడు శంకర్ శర్మను ఈ పురావస్తు పరిశోధనకు డైరెక్టర్‌గా నియమించారు. ఆయన నేతృత్వంలోని పురావస్తు పరిశోధకుల టీమ్ నెల రోజుల పాటు దుబ్బా గ్రామంలో తవ్వకాలు, పురావస్తు పరిశోధన జరపాల్సిన నిర్దిష్ట ప్రదేశపు ఉపరితలాన్ని వెతికి, అత్యంత కచ్చితత్వంతో గుర్తించింది. చివరకు మే 9న ఆ ప్రదేశంలో తవ్వకాలను ప్రారంభించారు. ఇప్పటి వరకైతేే ఈ ఊరిలోని దాదాపు ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో తవ్వకాలు జరిపారు. తదుపరి దశలలో లోతైన రీసెర్చ్ కోసం తవ్వకాలు జరిపే ప్రదేశపు పరిధిని మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
తవ్వకాల్లో ఏమేం బయటపడ్డాయి?
- మగధ విశ్వవిద్యాలయ పురావస్తు బృందం గయ జిల్లా దుబ్బా గ్రామంలో జరిపిన తవ్వకాలలో దాదాపు 1200 సంవత్సరాల క్రితం నాటి పాల కాలానికి చెందిన భారీ బౌద్ధ మఠం అవశేషాలను కనుగొన్నారు. పాల రాజవంశం క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు తూర్పు భారతదేశాన్ని పాలించింది. ప్రస్తుత బిహార్, బంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతాలు ఈ సామ్రాజ్యం కింద ఉండేవి.
- బౌద్ధ విహారానికి సంబంధించిన భారీ గోడలు, ఇటుక కట్టడాల పునాదులు ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి.
- బౌద్ధ భిక్షువులు నివసించడానికి, ధ్యానం చేయడానికి ఉపయోగించిన చిన్న గదులు, వాటి గోడలలో దీపాలు, విగ్రహాలను ఉంచే గూళ్లు లభించాయి.
- ఇటుకల పునాదిపై సున్నపు పూతతో చక్కగా నిర్మించిన ఒక రెండు అంతస్తుల భవనాన్ని(గ్రౌండ్ ఫ్లోర్ + ఫస్ట్ ఫ్లోర్) కనుగొన్నారు. ఈ భవనంలోని రెండు అంతస్తులలో ఒకటి చెక్కుచెదరకుండా ఉండగా, మరొకటి పాక్షికంగా దెబ్బతిని ఉంది.
- ఒక గది గోడలోని గూడులో అమర్చి ఉన్న 3 అరుదైన బౌద్ధ దేవతల రాతి విగ్రహాలను గుర్తించారు.
- విభిన్న హావభావాలు, ముద్రలలో ఉన్న భగవాన్ బుద్ధుడి రాతి విగ్రహాలు లభించాయి.
- భక్తులు తమ మొక్కుల నిమిత్తం సమర్పించిన ఇటుకలు, రాళ్లతో చేసిన అనేక చిన్న లఘు స్తూపాలు బయటపడ్డాయి.
- బౌద్ధ విహార ప్రాంగణంలో చెల్లాచెదురుగా ఉన్న డజన్ల కొద్దీ రాతి స్తంభాలు దొరికాయి. వీటిలో కొన్ని స్తంభాలపై 9-10 శతాబ్దాల నాటి ప్రాచీన నాగరి లిపి చెక్కబడి ఉంది.
- సీసాలను లేదా పాత్రలను మూసివేయడానికి ఉపయోగించే, తామర మొగ్గ ఆకారంలో ఉన్న ఒక అందమైన మట్టి మూత లభించింది.
- పురాతన కాలంలో అలంకరణకు వాడిన అనేక టెర్రకోట (కాల్చిన మట్టి) పూసలు దొరికాయి.
- క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి మానవ నివాస జాడలను సూచించే ప్రాచీన మట్టి పాత్రల ముక్కలు లభించాయి.
3 విగ్రహాలు – విశేషాలు
- పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న భారీ పురాతన బౌద్ధ మఠం లోపల, భిక్షువులు నివసించే ఒక చిన్న గది గోడలోని గూడు లేదా సందులో బౌద్ధ దేవతల మూడు రాతి విగ్రహాలు దొరికాయి. ఈ విగ్రహాలను చాలా గట్టిదైన, నాణ్యమైన నల్ల బసాల్ట్ రాయితో తయారు చేసినట్లు గుర్తించారు. పాల రాజుల కాలంలో ఇటువంటి నల్ల రాతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది.
- లభించిన వాటిలో మొదటిది తారా దేవి విగ్రహం. ఈమె బౌద్ధమతంలో అత్యంత ప్రముఖ గ్రామ దేవత. ఈ విగ్రహం ఆనాడు జరిగిన వజ్రయాన బౌద్ధమత వ్యాప్తిని సూచిస్తోంది.
- భూమిస్పర్శ ముద్రలో బుద్ధుడు ఉన్న మరొక విగ్రహం దొరికింది. బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందే తరుణంలో, సత్యానికి సాక్ష్యంగా తన కుడిచేతి వేళ్లతో భూమిని తాకుతూ కూర్చునే పవిత్ర భంగిమ ఇది.
- ఇక మూడో విగ్రహం తారా దేవితో కూడిన బౌద్ధ దేవతల సమూహానికి చెందిన ఒక అరుదైన ప్రతిమ. పాల రాజుల కాలంలో వజ్రయాన బౌద్ధమతం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పూజలందుకున్న మరికొన్ని సహచర బౌద్ధ దేవతా రూపాలు, బోధిసత్వుల రూపాలలో ఒకటిగా దీన్ని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ నిర్మాణాల నాణ్యత అద్భుతం
“ఈ పురాతన బౌద్ధ మఠంలో చిన్నచిన్న గదులు ఉన్నాయి. ఇవి ఇప్పటివరకు వెలికితీసిన నలంద మహావిహార (ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం) సహా ఇతర ప్రాచీన మఠాలలోని గదులను పోలి ఉన్నాయి. వీటిని బౌద్ధ సన్యాసులు ధ్యానం, విశ్రాంతి కోసం ఉపయోగించినట్లు తెలుస్తోంది. సున్నపు ప్లాస్టర్‌తో ఆనాడు ఫ్లోర్‌ను తయారు చేసుకున్నారు. దీన్నిబట్టి ఆనాటి నిర్మాణ కార్యకలాపాలలో ఎంతటి క్వాలిటీని మెయింటైన్ చేసేవాళ్లో అర్థం చేసుకోవచ్చు” అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)లో సుదీర్ఘకాలం పనిచేసిన శంకర్ తెలిపారు.
వర్షాకాలం తర్వాత ప్రధాన కట్టడాన్ని వెలికితీస్తాం
“ఈ మఠం లోపల భారీ ఇటుకలతో 35 అడుగుల ఎత్తైన దిబ్బను గుర్తించారు.దాని చుట్టూ చెల్లాచెదురుగా పడి ఉన్న అనేక రాతి స్తంభాలు బయటపడ్డాయి. ఒకప్పుడు అక్కడ భారీ నిర్మాణాలు ఉండేవి అనేందుకు ఆ రాతిస్తంభాలే ఆధారాలు. 35 అడుగుల ఎత్తైన దిబ్బ ఈ మఠానికి సంబంధించిన ఒక ప్రధాన కట్టడాన్ని కనుగొనడానికి దారితీస్తుందని మేం నమ్ముతున్నాం. ఈ ఏడాది వర్షాకాలం తర్వాత మేం దాన్ని వెలికితీస్తాం.ఈ మఠం క్రీ.శ. 8వ శతాబ్దం నాటిది కావచ్చు. తవ్వకాలు పూర్తయి, మరిన్ని నిర్మాణాలు, పురాతన వస్తువులు బయటపడిన తర్వాత, ఈ రంగంలోని ప్రముఖ నిపుణుల అభిప్రాయాన్ని మేం తీసుకుంటాం” అని శంకర్ తెలిపారు.
ఆ పొరల వల్లే సాంస్కృతిక క్రమం తెలిసింది
“పురాతన బౌద్ధ మఠం బయటపడిన ప్రదేశంలోని పొరల ఆధారంగా ఆనాటి సాంస్కృతిక క్రమాన్ని స్పష్టంగా గుర్తించాం. ఇక్కడ మాకు క్రీస్తు పూర్వం 3వ – 2వ శతాబ్దం (మౌర్యుల కాలం) నాటి ఆధారాలు దొరికాయి. అప్పటి నార్తెర్న్ బ్లాక్ పాలిష్డ్ పాత్రలు, బ్లాక్ స్లిప్డ్ పాత్రలు లభించాయి. గుప్త సామ్రాజ్యం అంతరించిన తర్వాత కూడా ఈ బౌద్ధ క్షేత్రం చురుకుగా సాగింది. ఆ కాలానికి చెందిన మట్టి పాత్రలు, కట్టడాల అవశేషాలు దొరికాయి. ఇక ఈ మఠపు పై రెండు పొరలలో క్రీ.శ. 8వ, 12వ శతాబ్దాల మధ్య కాలపు (పాల యుగం) గుర్తులు లభించాయి. ఈ కాలంలోనే ఇక్కడ భారీ బౌద్ధ మఠం, స్థూపాలు, నల్ల రాతి విగ్రహాల నిర్మాణం జరిగింది. ఇప్పుడు పైన మనకు కనిపిస్తున్న గోడలు, ఇటుకల నేలలు అన్నీ ఈ పాల రాజుల కాలానివే” అని ఈ పురావస్తు పరిశోధన డైరెక్టర్, మగధ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యుడు శంకర్ శర్మ వివరించారు.
బుద్ధుడితో గానీ, ఆయన శిష్యులతో కానీ సంబంధం ఉండొచ్చు
“ఇప్పుడు బయటపడిన పురాతన బౌద్ధ మఠం అనేది బౌద్ధమతంలోని మహాయాన శాఖకు ఒక ప్రధాన కేంద్రంగా ఉండి ఉండొచ్చు. దీని ప్రాముఖ్యతపై మనం మరింత పరిశోధన చేయాలి. ఈ ప్రదేశానికి బుద్ధుడితో గానీ, ఆయన ప్రసిద్ధ శిష్యులలో ఎవరైనా ఒకరితో గానీ గణనీయమైన రీతిలో సంబంధం ఉండొచ్చు” అని మగధ విశ్వవిద్యాలయంలోని ప్రాచీన భారత, ఆసియా అధ్యయనాల విభాగాధిపతి, తవ్వకాల సహ డైరెక్టర్ అల్కా మిశ్రా తెలిపారు.
పరిశోధనకు ఇప్పటికే రూ.50 లక్షలు ఇచ్చాం
“ఈ పరిశోధనలో చాలా విషయాలను గుర్తించాం. ఈ ఆవిష్కరణలు పురావస్తు ప్రపంచంలో పెను సంచలనం సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ రీసెర్చ్‌కు పూర్తి మద్దతును అందించాలని నేను నిశ్చయించుకున్నాను. ఇందుకోసం మేం ఇప్పటికే రూ. 50 లక్షలు అందించాం” అని మగధ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ శశి ప్రతాప్ షాహి తెలిపారు.





