
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్న యోగా 365 కార్యక్రమానికి అర్హత, ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం యోగాను సామూహిక ఉద్యమంగా ప్రోత్సహించేందుకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబిల్ట్ హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో 100 రోజుల ఉచిత ప్రత్యక్ష యోగా తరగతులను నిర్వహిస్తుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లాలోని క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, అన్ని వయస్సుల సాధారణ ప్రజలు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్ కోసం 18003157008 నంబర్‌లో సంప్రదించాలన్నారు. గతంలో ఐడీవై 2025లో పేరు నమోదు చేసుకున్న వారు ప్రస్తుతం కొనసాగుతున్న యోగా 365లో చేరాలని కోరారు.



