
ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నెలవైన పుట్టపర్తి గడ్డపై దేశ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దేశీయ పరిజ్ఞానంతో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారుచేసే ప్రతిష్ఠాత్మక అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA – ఆమ్కా) ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుతో పుట్టపర్తి ఇకపై భక్తికే కాకుండా దేశ భద్రతకు కూడా కీలక చిరునామాగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
పుట్టపర్తిలో నూతన అధ్యాయం
పుట్టపర్తి ఇకపై ఆధ్యాత్మిక స్ఫూర్తి నుంచి వ్యూహాత్మక ఆవిష్కరణల కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ఆంకా’ ప్రాజెక్టు ద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి అవుతుందని ఆయన తెలిపారు. ప్రాథమికంగా రూ.15,803 కోట్ల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా తొలిదశలో 7,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.
భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. స్వదేశీ సాంకేతికతతో అత్యాధునిక యుద్ధ విమానాలను తయారు చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
జెట్ స్పీడ్‌తో అనుమతులు
ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసిన వేగాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు నిదర్శనమని అన్నారు.
“ఈ ఏడాది 9వ తేదీన రక్షణ శాఖలో చర్చలు మొదలైతే, 20న ప్రతిపాదనలు అడిగారు. 24న మేం పంపాం, 28న కేంద్రం అంగీకరించింది. 29న అధికారులు స్థలాన్ని పరిశీలించి, 30న రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. జెట్ స్పీడ్‌తో ఫైటర్ జెట్ ప్రాజెక్టును సాధించాం” అని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టు మంజూరులో కీలక పాత్ర పోషించిన ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీకి రక్షణ కవచం
‘ఆమ్కా’ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఇతర రక్షణ, అనుబంధ పరిశ్రమల గురించి కూడా సీఎం ప్రస్తావించారు. మడకశిరలో భారత్ ఫోర్జ్, హెచ్‌ఎఫ్‌సీఎల్, దోనకొండలో బీడీఎల్ సంస్థలు రూ.2,959 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని, దీనివల్ల 4-5 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ ద్వారా దేశంలోనే ఆధునిక డ్రోన్ ఎకోసిస్టమ్‌కు శ్రీకారం చుట్టామని, రూ.686 కోట్ల పెట్టుబడులతో 8 సంస్థలు వస్తున్నాయని, తద్వారా 2,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయలంక నుంచి క్షిపణి శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, ఇప్పుడు పుట్టపర్తి నుంచి వైమానిక శక్తితో ఆంధ్రప్రదేశ్ దేశానికి రక్షణ కవచంగా నిలుస్తోందని చంద్రబాబు అన్నారు.





