News

RRB ఎగ్జామ్ కోసం మంగళ సూత్రానికి టేపు.. గాజులు తీయించేశారు..

35views
గుంటూరు జిల్లాలో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్ష రాయడానికి వెళ్లిన అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. వారి మనోభావాలు దెబ్బతీసేలా సిబ్బంది వ్యవహరించారు. పేరేచర్ల సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్ లో శుక్రవారం ఆర్ ఆర్ బీ పరీక్ష జరిగింది. ఓ వివాహిత మెడలోని మంగళ సూత్రానికి టేపు వేశారు. అలాగే మెట్టెలు, గాజులు తీయించేశారు. కమ్మలు, ముక్కు పుడుకలను కూడా అనుమతించలేదు. అలాగే చేతికి వుండే కంకణాలను కూడా తెంచేశారు.
సూరత్ లో …
తాజాగా.. సూరత్ లో ఓ పరీక్షా కేంద్రంలో NEET పరీక్ష జరుగుతోంది. ఈ సమయంలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తులసి మాల ధరించినందుకు పరీక్షకు వచ్చిన ఓ హిందూ విద్యార్థిని పరీక్షా అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తులసీ మాలను తొలగించాలని బలవంతం చేశారు.
గతంలో జరిగిన సంఘటనలివీ…
గత నెల 18 వ తేదీన కూడా కర్నాటకలోని శివమొగ్గ ప్రాంతంలో అచ్చు ఇలాంటి ఘటనే జరిగింది.కర్నాటక కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CET) సందర్భంగా విద్యార్థులను తమ యజ్ఞోపవీతాలను తొలగించమని నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో నటరాజ్ భాగవత్ అనే వ్యక్తి అధికారులపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.అలాగే దర్యాప్తు కూడా ప్రారంభించారు.
2017 లో కేరళలో జరిగిన NEET పరీక్ష సందర్భంగా కూడా ఇలాంటి వివాదమే రేగింది. సమయంలో కేరళలోని ఒక పరీక్షా కేంద్రంలో మహిళా అభ్యర్థులను కఠినంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో కొంతమంది విద్యార్థినుల తాళిబొట్లు, అంతర్గత దుస్తుల వరకు తీసివేయించారని ఆరోపణలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదంగా మారింది.
అలాగే అదే సంవత్సరం CBSE పరీక్షలు కూడా జరిగాయి.కేరళలోని కొన్ని కేంద్రాల్లో విద్యార్థినులను తాళిబొట్లు, మెట్టెలు తొలగించమని ఒత్తిడి చేశారని వార్తలు వచ్చాయి.
నవంబర్ 2023లో, కర్ణాటక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన మహిళా అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోపలికి వెళ్ళే ముందు వారి మంగళసూత్రాలు, కాలి మెట్టెలు, చెవిపోగులు, గొలుసులు మరియు ఉంగరాలను తీసివేయాలని అధికారులు కోరారు.