News

బీఎస్ఎఫ్ అధీనంలోకి 45 రోజుల్లో సరిహద్దు ఫెన్సింగ్..

0views

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి  జరిపిన తొలి క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్‌ కోసం భూమిని బీఎస్ఎఫ్‌కు ఈరోజు నుంచే స్వాధీనం చేస్తున్నట్టు ప్రకటించారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికడతామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రధానంగా హామీ ఇచ్చింది. ఈ హామీ అమలు దిశగా సువేందు సర్కార్ తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర సెక్రటేరియట్‌లో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో సువేందు మాట్లాడుతూ, ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్‌కు అవసరమైన భూమి బీఎస్ఎఫ్ కంట్రోల్‌లోకి రానున్నట్టు చెప్పారు. బీఎస్‌ఎఫ్‌కు భూమిని బదిలీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈరోజుతో ఈ ప్రక్రియ ప్రారంభమైన రాబోయే 45 రోజుల్లో పూర్తవుతుందని వివరించారు. సరిహద్దు ఫెన్సింగ్‌ను బీఎస్ఎఫ్ సాధ్యమైనంత త్వరలో పూర్తిచేసి అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు.

బెంగాల్‌లో అక్రమ చొరబాట్ల వ్యవహారం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. బుజ్జగింపు రాజకీయాల కారణంగానే బంగ్లాదేశీ చొరబాటుదారుల కోసం సరిహద్దులను టీఎంసీ తెరిచి ఉంచిందని బీజేపీ పదేపదే విమర్శలు గుప్పించింది. బీజేపీ అధికారంలోకి వస్తే సరిహద్దు ఫెన్సింగ్‌కు అవసరమైన భూమిని 45 రోజుల్లోనే బీఎస్ఎఫ్‌కు అందజేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు.

ఇదీ సరిహద్దు పరిస్థితి..

బంగ్లాదేశ్‌తో బెంగాల్‌కు 4,097 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కేంద్ర హోం శాఖ సమాచారం ప్రకారం, సుమారు 3,240 కిలోమీటర్ల మేర ఇప్పటికే ఫెన్సింగ్ వేయడం జరిగింది. 175 కిలోమీటర్ల కొండప్రాంతం సహా 850 కిలోమీటర్ల మేర ఎలాంటి ఫెన్సింగ్ లేదు. గత టీఎంసీ ప్రభత్వం భూమి కేటాయింపులో చేస్తున్న జాప్యం కారణంగా ఫెన్సింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని బీజేపీ పదేపదే ఆరోపిస్తూ వచ్చింది. ఫెన్సింగ్ పనులతో ముందుకు వెళ్లడానికి ముందు స్థానిక భూమి, జీవనోపాధి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని టీఎంసీ చెబుతూ వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు నిర్వహణ కేంద్రం పరిధిలో ఉండటంతో టీఎంసీ హయాంలో సరిహద్దు భద్రతా ఆపరేషన్లు బీఎస్ఎఫ్ అధీనంలో ఉండేవి. అయితే ఫెన్సింగ్ ప్రాజెక్టులకు సంబంధించి భూమి సేకరణ, స్థానిక అనుమతులు, అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేషన్ వంటివి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండేవి. 2021లో సరిహద్దు ప్రాంతాల లోపల బీఎస్ఎఫ్ పరిధిని బెంగాల్‌లో 15 కిలోమీటర్ల నుచి 50 కిలోమీటర్లకు కేంద్ర విస్తరించింది. ఈ చర్యను సమాఖ్య అధికారాలపై దాడిగా టీఎంసీ వ్యతిరేకించింది.