
జీవితం ఆనందమయంగా ఉండాలంటే ఆధ్యాత్మికత సాధనంగా పనిచేస్తుందని శ్రీశ్రీ రవిశంకర్ తెలిపారు. బెంగళూరులోని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరై కొత్తగా నిర్మించిన ధ్యాన్ మందిర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘సంతోషానికి అవధులు లేవు. ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించుకున్నాం. దేశ సంక్షేమానికి అనేక మంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంచి మార్గం వైపు నడిస్తే.. ఎల్లప్పుడూ విజయమే వరిస్తుంది. ఒత్తిడి లేకుండా జీవించాలంటే కొన్ని మార్పులు అవసరం. మనం సంతోషంగా ఉంటూ.. పక్కవారిని ఆనందంగా ఉంచాలి. ప్రజా శ్రేయస్సు కోసం మంచి మార్గంలో నడవాలి’’ అని సూచించారు.
ఆర్ట్‌ఆఫ్ లివింగ్ మానవతావాద సంస్థ: ప్రధాని మోదీ
సేవ, సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పుట్టినిల్లు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మికత, సేవాభావంలో భారత్ ముందువరుసలో ఉంటుందన్నారు. భారతదేశంలోని ఆధ్యాత్మిక ఉద్యమాలు ఎప్పుడూ మానవసేవకే ప్రాధాన్యత ఇచ్చాయని వివరించారు. అదే స్ఫూర్తి.. ఆర్ట్ ఆఫ్ లింగ్ చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రతిబింబిస్తోందన్నారు. ‘‘ఒత్తిడి, హింస లేని సమాజ నిర్మాణానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ విశేష కృషి చేస్తోంది. ఆర్ట్‌ఆఫ్ లివింగ్ మానవతావాద సంస్థ. ధ్యానం, ప్రాణాయామం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంచుకోచ్చు. సమాజ శ్రేయస్సుకు సేవ, ప్రేమ వంటి సాధనాలు ఉపకరిస్తాయి. రోజువారీ జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించాలి. ఉన్నత లక్ష్యాల సాధనకు ఒత్తిడిలేని ఏకాగ్రత అవసరం. సంకల్పం స్పష్టంగా ఉండి.. సేవా భావంతో పనిచేస్తే విజయం తథ్యం. స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రభుత్వ కార్యక్రమం కాదు.. అందరూ కలిసి చేయాల్సింది. సమాజం బాగుంటేనే మనమంతా సంతోషంగా ఉంటాం. ఇతరులకు సేవ చేయడం వంటి విషయాలకు ఆర్ట్‌ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు తోడుగా ఉంటాయి’’ అని మోదీ తెలిపారు.





