ఒడిశాలోని పూరీ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్ల రెండు వైపులా వరుసగా ఉన్న చెట్లు, మొక్కలకు శంఖాలు, దేవుడి ఫొటోలు ఉన్న వస్త్రాలు కట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చెట్లను కాపాడేందుకు ఓ వ్యక్తి చేపట్టిన ఆ వినూత్న ప్రయత్నం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ఆ వ్యక్తి పేరు విశ్వనాథ్ ప్రధాన్. ప్రస్తుతం ఆయన ట్రీమ్యాన్గా గుర్తింపు పొందారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి
జిల్లాలోని పిపిలి సమీపంలోని పోపరంగా పంచాయతీ హైస్కూల్‌లో విశ్వనాథ్ ప్రధాన్ ప్యూన్‌గా పనిచేస్తున్నారు. సాధారణ ఉద్యోగి అయినా ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమ మాత్రం అసాధారణం. చిన్నప్పటి నుంచే మొక్కలు నాటాలనే అభిరుచి ఉన్న ఆయన, ఇప్పుడు అదే పనిని జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు. గత 25 ఏళ్లుగా నిరంతరం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 లక్షలకుపైగా మొక్కలు నాటారు.
విశ్వనాథ్ ప్రధాన్ మాట్లాడుతూ, “చిన్నప్పటి నుంచే మొక్కలు నాటాలనే కోరిక ఉండేది. వర్షాకాలంలో గుంతలు తవ్వి విత్తనాలు వేస్తే అవి పెద్ద చెట్లుగా మారతాయని నమ్మకం. అందుకే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా విత్తనాలు నాటుతాను. ప్రజలకు కూడా మొక్కలు నాటాలని చెబుతుంటాను. చెట్లు ఉంటే పర్యావరణం బాగుంటుంది” అని తెలిపారు. ఆయన ముఖ్యంగా వేప, మర్రి, రావి, బెల, కదంబ వంటి చెట్లను ఎక్కువగా నాటుతున్నారు. రోడ్ల పక్కన, స్కూల్ ప్రాంగణాల్లో, ఖాళీ స్థలాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటారు. కేవలం మొక్కలు నాటడమే కాదు అవి పెద్ద చెట్లుగా ఎదిగే వరకు వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నీళ్లు పోయడం, కలుపు తొలగించడం, విరిగిన కొమ్మలను సరిచేయడం వంటి పనులు కూడా స్వయంగా చేస్తున్నారు.
ప్రస్తుతం విశ్వనాథ్ చేపట్టిన మరో వినూత్న చర్య అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చెట్లను ఎవరూ నరకకుండా ఉండేందుకు వాటికి శంఖాలు, దేవుడి ఫొటోలు ఉన్న వస్త్రాలు కడుతున్నారు. దీనివల్ల ప్రజల్లో ఆ చెట్లపై ఆధ్యాత్మిక భావన పెరిగి వాటిని నరికేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన చెబుతున్నారు. “శంఖం, శాలువా కడితే అది పవిత్రంగా భావిస్తారు. అలా చెట్లను కాపాడుకోవచ్చు” అని ఆయన వివరించారు. స్వల్ప జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటూనే విశ్వనాథ్ ప్రకృతి కోసం నిశ్శబ్దంగా సేవ చేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటినట్లు ఆయన చెబుతున్నారు. పాఠశాలకు వెళ్లే ముందు విత్తనాలు సేకరించి నర్సరీలో మొక్కలు పెంచుతారు. స్కూల్ ముగిసిన తర్వాత, సెలవు రోజుల్లో స్కూటర్‌పై తిరుగుతూ వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటుతుంటారు.
పూరీతో పాటు కేంద్రాపడా, జగత్సింగ్‌పుర్, మయూరభంజ్, ఢెంకనాల్, నయాగఢ్, కటక్ వంటి జిల్లాల్లో కూడా విశ్వనాథ్ వేలాది మొక్కలు నాటారు. ప్రకృతిని పచ్చగా మార్చాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న కృషి స్థానికులను ఎంతగానో ప్రభావితం చేస్తోంది. పోపరంగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శశిభూషణ్ మహాపాత్ర మాట్లాడుతూ, “ప్రపంచంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ఈ సమయంలో చెట్లు నాటడం చాలా అవసరం. మనిషి బతకడానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. విశ్వనాథ్ స్కూల్ పని ముగిసిన తర్వాత కూడా మొక్కల సంరక్షణ కోసం బయటకు వెళ్తుంటారు. ఆయన చేస్తున్న సేవ నిజంగా గొప్పది” అని ప్రశంసించారు.
నిజంగా ప్రకృతి సేవకుడు
అయితే ఇంత పెద్ద సేవ చేస్తున్నప్పటికీ విశ్వనాథ్‌కు ఇంకా ప్రకృతి మిత్ర పురస్కారం రాకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను గుర్తించి గౌరవించాలని అభిప్రాయపడ్డారు. పోపరంగా పంచాయతీ మాజీ సర్పంచ్ అజయ్ ప్రధాన్ కూడా విశ్వనాథ్ సేవలను కొనియాడారు. “తన జీతంలోనే డబ్బులు ఖర్చు చేసి వివిధ జిల్లాల్లో మొక్కలు నాటుతున్నారు. ఆయన నిజంగా ప్రకృతి సేవకుడు. ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించాలి” అని కోరారు
స్థానికులు కూడా విశ్వనాథ్ పనిపై గర్వపడుతున్నారు. స్థానిక నివాసి ఉగ్రసేన్ బరాల్ మాట్లాడుతూ, “తన సొంత డబ్బులతో మొక్కలు నాటి వాటిని సంరక్షించడం చిన్న విషయం కాదు. ఆయన వల్ల ఎంతోమంది చెట్ల నీడను పొందుతున్నారు” అని చెప్పారు. పర్యావరణవేత్త సరోజ్ కుమార్ జేనా మాట్లాడుతూ, “ప్రకృతిని ప్రేమించే వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. విశ్వనాథ్ ఎప్పుడూ బ్యాగ్‌లో మొక్కలు పెట్టుకుని తిరుగుతుంటారు. ఎక్కడ చెట్టు విరిగినా దాన్ని సరిచేస్తారు. ఇలాంటి వ్యక్తులను సమాజం ప్రోత్సహించాలి” అని అన్నారు. ఒక సాధారణ స్కూల్ ఉద్యోగి తన జీవితాన్ని ప్రకృతికి అంకితం చేసి వేలాది చెట్లకు జీవం పోస్తుండటం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది. చెట్లను కాపాడేందుకు శంఖాలు, శాలువాలు కట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న విశ్వనాథ్ ఆలోచన ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణలో వినూత్న ప్రయత్నంగా నిలుస్తోంది.





