
దేశ రాజధానిలోని కీలకమైన ప్రదేశాల్లో ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ల -IEDలుతో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో హైఅలర్ట్ ప్రకటించారు. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకు నిఘా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాలను IEDలతో లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దాంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అత్యంత సున్నితమైన రద్దగా ఉండే ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
హెచ్చరిక నేపథ్యంలో, నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం బయట కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరొకవైపు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించి, అదనపు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
కీలక ప్రదేశాలలో మోహరించిన భద్రతా దళాలు కూడా లక్ష్యంగా మారే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తానీ గ్యాంగ్‌స్టర్-ఉగ్రవాది షాజాద్ భట్టికి సంబంధించిన ఒక ముఠాను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించిన కొన్ని వారాల తర్వాత ఈ తాజా హెచ్చరిక వెలువడింది. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా, ఈ ముఠా సభ్యులు ఢిల్లీలో హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.




