ArticlesNews

ఆదర్శప్రాయం రామబంటు తత్వం

9views

( మే 12  – హనుమజ్జయంతి  )

అచంచల భక్తికి, అద్వితీయ శక్తికి తార్కాణం ఆంజనేయ స్వామి. వినయానికి, అభయానికి నిలువుటద్దం ఆ పవనసుతుడు. అబ్బురపరిచే ఆయన గుణగణాలు మానవాళికి మార్గదర్శకాలు. రామబంటు తత్వం అద్భుతం, ఆదర్శప్రాయం.

నుమంతుడి పేరు వినగానే గుర్తుకు వచ్చే మొదటి గుణం రామ భక్తి. శ్రీరాముడి పట్ల మారుతి భక్తికి కొలమానమే లేదు. పెద్దల పట్ల అలాంటి మన్ననను, దైవం పట్ల అచంచల భక్తిని మనం అలవరచుకోవాలి. ఉత్తమ నడవడికకు అది పునాది అవుతుంది.

హనుమ వాక్పటిమ

బుద్ధిమతాం వరిష్ఠం (బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు) అని కీర్తినందుకుంటాడు హనుమంతుడు. అటు కండబలం, ఇటు గుండెబలం రెండూ ఆ స్వామి సొంతం. ఆయనను ఆరాధించేవారు కూడా అంతటి బలవంతులుగా ఎదగాలన్నది ఆంజనేయ తత్వంలోని ప్రధానాంశం. ఆయన నవవ్యాకరణ పండితుడు. రామ, లక్ష్మణులు సుగ్రీవుని వెతుకుతూ కిష్కింధకు వచ్చినప్పుడు, వారిని పరీక్షించడానికి సుగ్రీవుడు హనుమంతుణ్ణి పంపించాడు. అతడు భిక్షుక రూపంలో వెళ్లి వారితో మాట్లాడాడు. ఆ మాటతీరు చూసి రాముడు ముగ్ధుడై ‘లక్ష్మణా! ఇతడు ఒక్క అపశబ్దం కూడా పలకలేదు. శారీరక కదలికలో ఎక్కడా విపరీత ధోరణి లేదు. ఈ విషయాలను గమనిస్తుంటే కచ్చితంగా పండితుడై ఉంటాడు’ అని హనుమంతుడి వాక్పటిమను మెచ్చుకున్నాడు. ఇవన్నీ ఆంజనేయుని భావప్రకటనా సామర్థ్యానికి తార్కాణం.

ఆదర్శ విద్యార్థి

విద్యార్థులకు హనుమంతుడు ఆదర్శప్రాయుడు. గురువు దగ్గర ఎలా చదువు నేర్చుకోవాలో ఆ స్వామి విద్యాభ్యాసం చేసిన తీరు చూస్తే తెలుస్తుంది. హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథం కంటే ముందు తానుంటూ.. వినయం చూపుతూ, ఏకాగ్రచిత్తుడై విద్య నేర్చుకున్నాడు. సకల విద్యలలోనూ పండితుడయ్యాడు. నవ వ్యాకరణాల్లో నిష్ణాతుడని పేరు తెచ్చుకున్నాడు. గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు ఎలా వినయంగా, దీక్షగా ఉండాలి, ఎంతగా శ్రమించాలి, ఎలా సమయ పాలన పాటించాలి- అనే విషయాలు హనుమ నుంచి నేర్చుకోవచ్చు.

అసాధారణ కార్యదక్షుడు

అప్పగించిన పనిని పూర్తిచేయడమే కాకుండా.. ఆ పని వల్ల తర్వాత ఏర్పడే పరిణామాలను కూడా ఆలోచించే క్రాంతదర్శి, కార్యదక్షుడు హనుమంతుడు. సీతమ్మ జాడ కనిపెట్టమని రాముడు చెబితే.. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి వెళ్లి సీతమ్మను చూడటమే కాకుండా, రావణుడి శక్తిని పరీక్షించి, లంకను దహనం చేసి, రాక్షసుల గుండెల్లో భయం పుట్టించి తిరిగొచ్చాడు. అలా పనిని పరిపూర్ణంగా ముగించటం ఆయన ప్రత్యేకత. క్రమశిక్షణాయుతంగా ఎదగాలనుకునే వారికి ఈ లక్షణం అనుసరణీయం.

రామనామ స్మరణ

అపారమైన శక్తి ఉన్నప్పటికీ హనుమంతుడు ఎప్పుడూ గర్వించలేదు. తన విజయాలన్నీ రామకృప వల్లే సాధ్యమయ్యాయని నమ్మేవాడు. అందుకే లంక నుంచి తిరిగొచ్చాక రాముడు హనుమంతుణ్ణి కౌగిలించుకుని అభినందించేంతటి గౌరవాన్ని పొందాడు. ఎవరికీ దక్కని రాముడి హృదయాలింగన భాగ్యం పొందినప్పటికీ.. ఆ పవనసుతుడు- ‘నేను కేవలం నీ దాసుణ్ణి, నీ నామస్మరణ వల్లే సముద్రాన్ని దాటగలిగాను’ అని రామచంద్రమూర్తికి నమస్కరించాడు. అది ఆయనలోని వినయపూర్వక స్వామిభక్తి.

ధైర్యం.. సమయస్ఫూర్తి

ఎటువంటి కష్ట సమయంలోనైనా కుంగిపోకుండా తగిన మార్గాన్ని వెతకడం హనుమంతుని నైజం. లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపోయినప్పుడు, ఆయన ప్రాణాలను రక్షించడానికి సంజీవని మూలికను తేవడానికి హనుమంతుడు వెళ్లాడు. తీరా మూలికను గుర్తించలేకపోయాడు. అప్పుడు సమయాన్ని వృథా చేయక.. ఆ పర్వతాన్నే పెకలించుకుని వచ్చాడు. ఇది ఆయన అచంచల ధైర్యానికి, సమయస్ఫూర్తికి నిదర్శనం.

హనుమంతుడు ప్రదర్శించిన ధైర్యస్థైర్యాలు వర్ణింపశక్యం కానివి. శక్తికి వినయం తోడై, అది దైవత్వంగా భాసించింది. సేవకుడిగా ఎలా ఉండాలి, నాయకుడిగా ఎలా నడవాలి, భక్తుడిగా ఎలా తరించాలి- అనే విషయాల్లో ఆ స్వామి  సదా, సర్వదా ఆదర్శప్రాయుడు. ఆంజనేయుని ప్రార్థించి.. జీవితాలను ఆనందమయం చేసుకుందాం.

బుద్ధిర్బలం యశో ధైర్యం
నిర్భయత్వమరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ
హనుమత్‌ స్మరణాత్‌ భవేత్‌ 

హనుమను తలిస్తే చాలు ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, స్థైర్యం, పేరు ప్రఖ్యాతులు, జ్ఞానం, వాక్చాతుర్యం సొంతమవుతాయి. ఇన్ని సద్గుణాలను మానవాళికి అందించే ఆ స్వామిని అనునిత్యం పూజించి తరిద్దాం.