
పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై బంగ్లాదేశ్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. బెంగాల్‌లో బీజేపీ బలపడుతుండటంతో అక్కడి పరిణామాలపై బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
బంగ్లాదేశ్ ఎంపీ నహిద్ ఇస్లాం మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ముస్లింల మద్దతు ఉందని వ్యాఖ్యానించారు. ఆమె ఢిల్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అలాగే బెంగాల్ ఎన్నికల్లో ముస్లింలు, మథువా వర్గాల ఓటు హక్కులపై కూడా ఆరోపణలు చేశారు.
“మమతా బెనర్జీ ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు కానీ మా మద్దతు కోల్పోలేదు. 17 కోట్ల బంగ్లాదేశీ ముస్లింలు ఆమె వెంట ఉన్నారు” అంటూ నహిద్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, మహమ్ద్ నూర్ హుదా డ్యూక్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులో, బీజేపీకి అధికారం అప్పగించకుండా మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాన్ని “ధైర్యవంతమైన చర్య”గా అభివర్ణించినట్లు తెలుస్తోంది.
మరికొందరు బంగ్లాదేశ్ నేతలు పశ్చిమ బెంగాల్‌ను ప్రత్యేక రాష్ట్రంగా లేదా స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించాలని వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత అంతర్గత రాజకీయాల్లో విదేశీ నేతలు జోక్యం చేసుకోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.





