
టెక్సాస్ రాజకీయాల్లోకి రావాలని ప్రకటించిన కెల్లీ స్మిత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి.
కెల్లీ స్మిత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఏఐ సాయంతో రూపొందించిన ఓ ఫొటోను పోస్టు చేసింది. అందులో ఆమె భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి హిందూ దేవాలయంలో ఉన్నట్లు కనిపించింది. అయితే ఆ పోస్టులో హిందూ ఆలయ సంప్రదాయాలను ఎగతాళి చేసేలా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.
“భారతీయులు తమను అమెరికన్లుగా చెప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా భారతీయురాలిగా మారుతున్నాను. నా కొత్త పేరు ‘ప్రియా’” అంటూ వ్యాఖ్యానించిన ఆమె, “గుడిలో హాంబర్గర్లు తింటాను.. బూట్లు వేసుకుంటాను.. నా టెక్సాస్ సంస్కృతిని వదులుకోను” అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా “గుడిలో స్టీక్స్ కాల్చుకుని తినాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు హిందూ భావోద్వేగాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.
హిందూ దేవాలయాల పవిత్రత, ఆచారాలను ఉద్దేశపూర్వకంగా అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని భారతీయులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆలయాల్లో మాంసాహారం, బూట్ల ప్రస్తావన చేయడం ద్వారా కోట్లాది హిందువుల విశ్వాసాలను కించపరిచారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పోస్టు వైరల్ కావడంతో పలువురు భారతీయులు కెల్లీ స్మిత్‌కు వ్యతిరేకంగా స్పందిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.



