
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో ఓ చర్చి పాస్టర్‌పై మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటపడటంతో గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత బాలిక కుటుంబంతో పరిచయం ఉన్న చర్చి పాస్టర్ చౌటపల్లి రాంబాబు, ఆ పరిచయాన్ని దుర్వినియోగం చేసి గత కొన్ని నెలలుగా బాలికపై లైంగిక దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, ఆమె గర్భవతి అయిన విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
విషయం బయటకు రాకుండా చేయడానికి గర్భస్రావ మాత్రలు ఇచ్చినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్‌గా స్పందించింది. కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు, సభ్యుడు ఉండవల్లి గాంధీబాబు గ్రామాన్ని సందర్శించి ఘటనపై సమగ్ర వివరాలు సేకరించనున్నారు. బాధిత బాలికకు అవసరమైన వైద్య, న్యాయ సహాయం అందించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.





