News

నందిగామలో ఘనంగా బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవం

7views

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని వర్తక సంఘం అసోసియేషన్ హాలులో జిల్లా బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. జిల్లాలోని నాలుగు బాలవికాస్ కేంద్రాల నుండి 65 మంది విద్యార్థిని–విద్యార్థులు పాల్గొనగా, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు, మాతాజీలు, ఖండ ధర్మ ప్రచారకులతో కలిపి సుమారు 100 మంది హాజరయ్యారు.

జిల్లా కన్వీనర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు జిల్లా కోర్టు ప్రముఖ న్యాయవాది శుభాకరరావు గారు, ఆర్ఎస్ఎస్ నాయకులు పాండే గారు, గోసంరక్షణ ప్రముఖ్ అశోక్ గారు, నందిగామ మండల మహిళా కన్వీనర్ లక్ష్మీ గారు, విభాగ్ ధర్మ ప్రచారక్ భూపతి గారు, జిల్లా ధర్మ ప్రచారక్ జయశంకర్ గారు, ఖండ ధర్మ ప్రచారకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది సుభాకరరావు గారు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పిల్లలు మంచి అలవాట్లు అలవరుచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి క్రమశిక్షణ, విలువలు, సమయపాలన ఎంత ముఖ్యమో విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు.

అనంతరం జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ సమరసతా సేవా ఫౌండేషన్ రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన దేవాలయాలను కేంద్రాలుగా చేసుకుని బాలవికాస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉద్దేశాన్ని వివరించారు. బాలవికాస్ కేంద్రాలకు హాజరయ్యే పిల్లలకు సంస్కారం, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు. పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, వారు తీసుకోవలసిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించారు.

భోజన విరామం అనంతరం స్థానికులు, తల్లిదండ్రులు, మాతాజీలు విడివిడిగా సమావేశమై సమరసత సేవా ఫౌండేషన్ గత పది సంవత్సరాలుగా దేశ ఐక్యత కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణం ద్వారా సామాజిక సమరసతను పెంపొందించే లక్ష్యాన్ని వివరించి, ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమం ముగింపులో మాతాజీలకు చిరు సత్కారాలు నిర్వహించి, పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతులు అందజేశారు. పిల్లలకు అల్పాహారం, చాక్లెట్లు పంపిణీ చేసి, అనంతరం వారిని సురక్షితంగా వారి వాహనాలలో గమ్యస్థానాలకు పంపించారు.

ఈ కార్యక్రమానికి ఆర్థిక, వస్తు, వాహన, వేదిక సౌకర్యాల రూపంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.