
హైకోర్టు ఆదేశాల మేరకు గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ కొలిశెట్టి శివకుమార్ డిమాండ్ చేశారు. గోవులను రక్షించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని శ్రీత్రిశక్తి హనుమాన్ దేవాలయంలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో వెంటనే చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు. రాబోయే బక్రీద్‌లో ఒక్క గోవును కూడా వధించకుండా నిఘా పెంచాలని, అక్రమ వధశాలలను తక్షణమే మూసేయాలని కోరారు. ఆవులను రక్షిస్తున్న గోరక్షకులపై పెట్టిన కేసులను ఎత్తేయాలన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టంచేశారు. ‘మన మౌనం- గోమాతకు మరణం’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ పోరాటంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని శివకుమార్ పిలుపునిచ్చారు. గోరక్షకులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విజయరాం, కుప్ప శ్రీనివాసప్రసాద్, చంద్రస్వామి, పురుషోత్తం గుప్తా, సంగమేశ్వరచారి, ఎం.పవన్‌కల్యాణ్, బండారు శ్రవణ్‌రెడ్డి తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు.





