ArticlesNews

‘ఆక్సిజన్​ బ్యాంక్​’ నిర్మించడమే లక్ష్యం!

16views

ప్రస్తుత కాలంలో చాలా చోట్ల చెట్లను నరికేసి కాంక్రీట్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజున భూమిపై గ్లోబల్​ వార్మింగ్​ విస్తరించిపోతుంది. అందుకే ఆ సమస్యను గుర్తించిన ఓ వయోవృద్ధుడు ప్రకృతి పరిరక్షణ కోసం సంకల్పించుకున్నారు. అలా గత 26 సంవత్సరాల్లో అతడు తన గ్రామం రూపరేఖలను మార్చేశారు. భవిష్యత్​ తరాల కోసం ఒక కీలకమైన “ఆక్సిజన్​ బ్యాంక్​”ను సృష్టించాలనే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందుకు తమ సొంత డబ్బును ఖర్చుచేస్తున్నారు. దాంతో ఆ ఊరి వాళ్లంతా అతడిని “ట్రీ మ్యాన్​”గా పిలుచుకుంటున్నారు.

హరియాణాలోని కైతల్​లో కిచ్ఛానా గ్రామంలో రాజ్​పాల్​ రాపడియా అనే 67 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నారు. అయితే 1995లో ఒక భయంకరమైన వరద ఆ గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసింది. తీవ్రమైన నీటి ముంపు కారణంగా, గ్రామంలోని దాదాపు అన్ని పురాతన వృక్షాలు వాడిపోయి నశించిపోయాయి. కనుచూపు మేరలో పచ్చదనం లేదా వృక్షసంపద జాడ ఒక్కటి కూడా మిగల్లేదు. అప్పుడే రాజ్‌పాల్ ఒక నిర్ణయానికి వచ్చారు. తన గ్రామానికి పూర్వపు పచ్చదనాన్ని తిరిగి తీసుకురావాలని అనుకున్నారు.

Old Man Initiative To Plant Trees

‘పిచ్చివాడు’ అన్నారు
దాంతో 26 సంవత్సరాల క్రితం అతడు ఒంటరిగా చెట్లు నాటడం ప్రారంభించారు. కానీ అప్పుడు అతడికి సమాజం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. అతడి సొంత సోదరులు, తోటి గ్రామస్థులు కూడా, అతడు కేవలం తన సమయాన్ని, డబ్బును వృథా చేస్తున్నాడని ఆరోపిస్తూ, “పిచ్చివాడు” అని ముద్ర వేశారు. అయినప్పటికీ, రాజ్‌పాల్ సంకల్పం చెక్కుచెదరలేదు. ఈ రోజు, ఆ ప్రజలే అతడు నాటిన చెట్ల నీడలో కూర్చుని, తన ముందుచూపుకు తమ హృదయపూర్వక ప్రశంసలను తెలియజేస్తున్నారు.

Old Man Initiative To Plant Trees

నాటడం మాత్రమే కాదు రక్షణ కూడా!
రాజ్‌పాల్ మొక్కలు నాటడానికి ఒక అనువైన నేలను ఎంచుకుంటారని ఆయన తెలిపారు. ఆ మొక్కలను నాటిన అనంతరం వాటిని సొంత బిడ్డను చూసుకున్నంత జాగ్రత్తగా కాపాడుతూ, పోషిస్తారని అన్నారు. తర్వాత పెరిగి పెద్దవైన ప్రతి చెట్టును కాపాడటానికి, ఇటుకలు, సిమెంటుతో దృఢమైన కంచెల నిర్మిస్తారని చెప్పారు. దాని కోసం స్వయంగా తనే నిధులు సమకూరుస్తున్నారని వెల్లడించారు. అలా ఒక్క చెట్టు కోసం సుమారు రూ.10,000 ఖర్చవుతుందని, ఇప్పటివరకు, 80కి పైగా చెట్లకు రక్షణ కల్పించారని అన్నారు. చిన్న మొక్కలను వీధి జంతువుల బారి నుంచి రక్షించడానికి, అతడు ప్రత్యేకంగా ఇనుప మెష్​తో ఆవరణలను ఏర్పాటు చేశారని తెలియజేశారు.

Old Man Initiative To Plant Trees

ఎక్కువగా ఆ చెట్లే నాటుతారు
ఈ వయసులో కూడా రాజ్​పాయ్​, మండుటెండలను లెక్కచేయకుండా మొక్కలను పెంచడంలో కృషి చేస్తున్నారు. ఆ మొక్కలకు నీరు పోయడం, వాటిని కత్తిరించడం వంటి పనులను ఆయన స్వయంగా చేస్తారని చెప్పారు. ఇప్పటివరకు ఆయన 2,000కి పైగా చెట్లను నాటారని అన్నారు. వీటిలో ప్రధానంగా మర్రి, రావి, వేప రకాలు ఉన్నాయని తెలిపారు. ఈ చెట్లలకు దీర్ఘకాలిక మనుగడ, అత్యధిక మొత్తంలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉండటాయని, అందుకే వీటిని ఎక్కువగా నాటుతారని ఆయన అన్నారు.

కుటుంబం సాయంతో
గత ఏడాదిలో తాను సుమారు 80 చెట్లను నాటినట్లు రాజ్‌పాల్ రాపడియా పేర్కొన్నారు. ఈ కృషిలో ఆయన కుటుంబం కూడా ఆయనకు క్రియాశీలకంగా మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు. గతంలో సైన్యంలో పనిచేసిన ఆయన కుమారుడు, పదవీ విరమణ అనంతరం హరియాణా పోలీసు శాఖలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఆయన హిసార్‌లో విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. చెట్ల నిర్వహణ, సంరక్షణ కోసం ఆయన కుమారుడు ప్రతి నెలా సుమారు రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు.

Old Man Initiative To Plant Trees

ప్రోత్సాహకంగా రూ.లక్ష
రాజ్​పాయ్​ చేస్తున్న ఈ పనికి జిల్లా అటవీ అధికారి ఆయనకు రూ.లక్ష ప్రోత్సాహక నిధిని అందించారని తెలిపారు. అయితే, గ్రామ పంచాయతీ నుంచి మాత్రం ఆయనకు ఇప్పటివరకు ఎటువంటి సహాయం లభించలేదని అన్నారు. అయినప్పటికీ, గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవం, పుట్టినరోజుల వంటి ప్రత్యేక సందర్భాలలో వివిధ సామాజిక కార్యకర్తలు, ఇతర గ్రామస్థులు ఆర్థిక సహాయం అందించడానికి ఇప్పుడు ముందుకు వస్తున్నారని అన్నారు. ఆ నిధులను ఆయన కేవలం కొత్త చెట్లను నాటడానికి, వాటి సరైన నిర్వహణకు మాత్రమే వినియోగిస్తారని రాజ్​పాయ్​ తెలిపారు. చెట్ల నిర్వహణ పనులను సులభతరం చేయడానికి వీలుగా, ఆయన ప్రత్యేకంగా రూపొందించిన మూడు మోటారు రిక్షాలను తయారు చేయించుకున్నారని అన్నారు.

Old Man Initiative To Plant Trees

బతికి ఉన్నంతవరకు సేవ
రాజ్‌పాల్ లక్ష్యం ఇప్పుడు కిచ్ఛానా గ్రామ పరిధులను దాటి, పొరుగు గ్రామాలకు కూడా విస్తరించింది. “నాకు శ్వాస ఉన్నంత వరకు, నా చివరి క్షణం వరకు నేను చెట్లను నాటుతూనే ఉంటాను. రానున్న తరాలకు నేను భౌతిక సంపదను వదిలి వెళ్లాలని కోరుకోవడం లేదు. బదులుగా, వారు స్వేచ్ఛగా శ్వాస తీసుకుని, శాంతిగా జీవించగలిగే పర్యావరణాన్ని వారసత్వంగా అందించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఆయన తెలిపారు.

ప్రకృతి పట్ల మనకు కూడా ఒక బాధ్యత ఉందని రాజ్‌పాల్ సంకల్పం మనకు హృదయపూర్వకంగా గుర్తు చేస్తుంది. ఈ రోజుల్లో, రాజ్‌పాల్ వంటి పర్యావరణ యోధులే భూమికి నిజమైన సంరక్షకులుగా నిలుస్తున్నారు. ఒకరి ఉద్దేశాలు ఉన్నతమైనవి, స్థిరమైనవి అయితే, ఒక్క వ్యక్తి మొత్తం పర్యావరణ వ్యవస్థను మార్చగల శక్తిని కలిగి ఉంటారని, ఇతరులు అనుసరించడానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా నిలుస్తారని ఆయన పని మనకు బోధిస్తుంది.