
0views
జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు అమెరికాలో స్థిరపడిన భారతీయులకు కీలకమైన పిలుపునిచ్చారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులు తమ భవిష్యత్తు గురించి పునరాలోచించి, భారత్ కి తిరిగి రావాలని ఎక్స్ మాధ్యమంగా కీలక పిలుపునిచ్చారు.అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించే ఈ లేఖ రాశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. దేశానికి తిరిగి వచ్చి, భారత అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా దశాబ్దాల క్రితం తాను అమెరికాకు వలస వెళ్లిన సొంత అనుభవాన్ని ఆ లేఖలో రాసుకొచ్చారు. ఆ దేశం ఒకప్పుడు అనేక అవకాశాలను ఇచ్చిందన్నారు. అదే సమయంలో వలస, ఉద్యోగాల విషయంలో ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయని, రాజకీయ పరిస్థితులు, ఇతరత్రా విషయాలు భారతీయులను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులు సాంకేతికత రంగంలో, ఇతరత్రా రంగాల్లో సొంతంగా ఎదగడంతోనే భారత్ గౌరవం ప్రపంచ వ్యాప్తంగా మరింత పెరుగుతుందని, దీనితోనే అంతా ముడిపడి వుందని పేర్కొన్నారు. అలాగే ఆయా రంగాల్లో వున్న నిపుణులు స్వదేశానికి తిరిగి వచ్చి, భారత్ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.
‘‘అమెరికాలోని భారతీయులకు బహిరంగ లేఖ. ప్రియమైన భారత సోదర సోదరీమణులారా… 37 సంవత్సరాల క్రితం నేను వచ్చినట్లే, మీరు కూడా డబ్బు లేకుండా, మంచి విద్యతో, భారత సాంస్కృతిక వారసత్వంతో అమెరికాకు వచ్చారు. మీరు అద్భుతమైత విజయం సాధించారు.అమెరికా మనకు ఎంతో మేలు చేసింది.అందుకు మనం కృతజ్ఞతతో ఉండాలి – కృతజ్ఞత మన భారతీయ నైజం.భారతీయులు మన ఉద్యోగాలు లాగేసుకుంటున్నారని అమెరికన్లు చాలా మంది అనుకుంటున్నారు. మన విజయం అన్యాయమైన విజయంగా వారు భావిస్తున్నారు.వచ్చే ఎన్నికలు దీన్ని సరిచేస్తాయని మీరు అనుకోవచ్చు, కానీ మీ ఎంపిక మన భారతీయ నాగరికతను ద్వేషించే వారికి, నాగరికతనే ద్వేషించే వారికి మధ్య ఉంటుంది. రైటిస్టులు, లెఫ్టిస్టులు మధ్య వుంటుంది. ఇందులో మీరు ప్రేక్షకులు మాత్రమే.అయితే.. ఓ విషయం మాత్రంనిజం. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులకు లభించే గౌరవం ఎక్కువగా భారత దేశపు తలరాతపైనే ఆధారపడి వుంటుంది. భారత్ పేద దేశంగానే వుండిపోతే, వామపక్ష మేధావులు మనకు నైతిక ఉపన్యాసాలిస్తారు. రైట్ వింగ్ వారు ఉపన్యాసాలిస్తారు.ఇదేదో మర్యాద అన్న భ్రమలో మనం వుండొద్దు. భారత్ లో మనం నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ పోతే, మన నాగరికత బలం కూడా తన ఉనికిని చాటుతుంది. ఇది ఊహించడం కష్టమే అయినా.. మీరందరూ స్వదేశానికి తిరిగి రండి. భారత మాతకు మీ ప్రతిభ ఎంతో అవసరం’’ అంటూ శ్రీధర్ వెంబూ రాసుకొచ్చారు.





