News

మొలక పోలేరమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు

42views

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో మే 5, 6, 7 తేదీల్లో 21 ఏళ్ల తర్వాత నిర్వహించనున్న గ్రామదేవత మొలక పోలేరమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సొమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జాతర విజయవంతంగా సాగేందుకు నెల్లూరు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు గ్రామస్థులతో సమన్వయం చేసుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో నిరంతరం పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించాలని‌ కోరారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ‌ప్రయాణికుల రద్దీకి అనుగుణం నెల్లూరు -‌ కృష్ణపట్నం మధ్య అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని‌ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఫైర్ ఇంజిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తుల అవసరాలకు తగ్గట్టుగా తాగునీరు అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. అవసరమైతే అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు.