
స్వాతంత్ర్య సమరంలో, దేశ ప్రజలను జాగృతం చేసిన వందేమాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో భవానీపురం పరిధి జక్కంపూడిలోని ఎస్ కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూలులో వందే చిత్రార్చన పేరుతో చిత్ర కళాప్రదర్శన ఏర్పాటు చేశారు. వందేమాతరం గీతం చరిత్ర, నేపథ్య చిత్రాలను గీసి ప్రదర్శించారు. 90 మందికి పైగా చిత్రకారులు స్వాతంత్య్ర సంగ్రామం, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను గీశారు. ఏపీ సృజనాత్మకత, సాంస్కృతిక సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిత్రకారులు వందేమాతరం గీతం నేపథ్యంలో అద్భుతమైన చిత్రాలను గీశారని, ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ విధమైన చిత్రకళా ప్రదర్శనను ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిర్వహించాలని, అందుకు తమవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
సంస్కార భారతి ఏపీ అధ్యక్షుడు పీవీఆర్ కృష్ణ మాట్లాడుతూ.. బంకిం చంద్ర ఛటర్జీ 1875లో వందేమాతరం గీతాన్ని రచించారని, స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని వెల్లడించారు. అనంతరం చిత్రకారులను సన్మానించారు. చిత్రకారులు గీసిన చిత్రాలను తిలకించేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. ముందుగా బంకించంద్ర ఛటర్జీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్, కేబీఎన్ కళాశాల కర స్పాండెంట్ టి. శ్రీనివాస్ పాల్గొన్నారు.





