
సంఘ్ ఓ స్పష్టమైన ఉద్దేశంతో ప్రారంభమైందని, సంఘ కార్య శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడమే లక్ష్యం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు సురేశ్ సోనీ అన్నారు. సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని జబల్ పూర్ లో ‘‘జన గోష్ఠి’’ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మేధావులు, చరిత్రకారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సురేశ్ సోనీ మాట్లాడుతూ భారత దేశపు ప్రాచీన తత్వశాస్త్రం, సంస్కృతి ప్రపంచ శ్రేయస్సు కాంక్షించేవిగా వున్నాయని, ఇది అత్యంత సహజమైన లక్షణమని కొనియాడారు. అయితే… కాలక్రమేణా ఈ సంప్రదాయం విచ్ఛిన్నమైందన్నారు. ఈ సమగ్ర దృక్పథాన్ని, సాంస్కృతికతను పున: స్థాపించడమే సంఘ్ ప్రధాన లక్ష్యమని, ఈ లక్ష్యం నెరవేరేంత వరకూ సంఘ్ ప్రస్థానం నిరంతరంగా కొనసాగుతూనే వుంటుందని స్పష్టం చేశారు.
సమాజం, సంఘ్ కలిసిపోయేంత వరకూ ఆరెస్సెస్ కార్యకలాపాలు కొనసాగుతూనే వుంటాయని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందను ప్రస్తావించారు.ఆయన చికాగో ప్రసంగానికి ముందు వివేకానంద సమాజాన్ని అర్థం చేసుకోవడానికి భారత దేశమంతా పర్యటించారని, వ్యక్తిత్వ నిర్మాణం, సామాజిక ఐక్యత, జాతీయ చైతన్యం మేల్కొల్పడం అత్యవసరమన్న నిర్ణయానికి వచ్చారన్నారు. ఈ ఆలోచనలనే హెడ్గేవార్ ఆచరణలోకి తెచ్చారన్నారు.
స్వాతంత్ర ఉద్యమంలోని విప్లవ, అహింసా లాంటి వివిధ ధోరణులను సురేశ్ సోనీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కేవలం రాజకీయ పోరాటం మాత్రమే సరిపోదని, సామాజిక సంస్కరణ కూడా అంతే అవసరమని అన్నారు. డాక్టర్ హెడ్గేవార్ అన్ని కోణాలనూ అర్థం చేసుకొని, వాటికి అనుగుణంగా సంస్థాగత కార్యకలాపాలను ముందుకు నడిపించారని పేర్కొన్నారు.
ఇక.. వ్యక్తిపూజపై కూడా మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో వ్యక్తివాదం మితిమీరిపోయిందని, అదే ప్రధాన బలహీనత అయ్యిందన్నారు. సనాతన సంస్కృతి సార్వత్రిక సంక్షేమం అనే భావనలో పాతుకుపోయిందని, ఈ విలువలను పెంపొందించడానికే సంఘ శాఖలు ఆచరణాత్మక కేంద్రాలుగా నిలుస్తున్నాయని అన్నారు.
దేశ వ్యాప్తంగా 80 వేలకు పైగా నిత్య శాఖలు నడుస్తున్నాయని అన్నారు.భారతీయ మజ్దూర్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరియు సేవా భారతి వంటి సంఘ్ ఆలోచనల నుండి ప్రేరణ పొందిన అనేక సంస్థలు సామాజిక అభివృద్ధికి చురుకుగా సహకరిస్తున్నాయని పేర్కొన్నారు.





