
వ్యక్తిగతంగా విజయం సాధిస్తే సరిపోదని, అందరి శ్రేయస్సు కోసం ఆ విజయాన్ని వినియోగిస్తేనే జీవితం సార్థకత చేకూరుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.ఈ నెల 26 న నాగపూర్ లో ‘‘నాగభూషణ్ అవార్డు ఫౌండేషన్’’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘నాగ భూషణ్ సమ్మాన్’’ కార్యక్రమంలో మోహన్ భాగవత్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ… ప్రపంచంలో అధికారం అత్యవసరమే అయినప్పటికీ.. అది సార్థక్యం కావాలంటే మాత్రం ఆ అధికారాన్ని తమ వ్యక్తిగత విజయాల కోసం వాడకూడదన్నారు. విజయం అనేది ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా వుండాలని, అలాగే అధికారానికి వినయం కూడినప్పుడే అర్థవంతంగా మారుతుందన్నారు. విజయంతో పాటు వినయం, కృతజ్ఞతా భావం అత్యంత ఆవశ్యకమని, ఒక ఉన్నతమైన ప్రయోజనం కోసం వినియోగించినప్పుడే ఒకరి విజయాలకు నిజమైన విలువ చేకూరుతుందని నొక్కి చెప్పారు.
గత 200 సంవత్సరాలుగా మహనీయుల జీవితాలను మోహన్ భాగవత్ ప్రస్తావిస్తూ. 90 శాతం శ్రమ, 10 శాతం ప్రేరణ అనే సూత్రాన్ని ప్రముఖంగా వివరించారు. తనను తాను, తన కుటుంబాన్ని దాటి విస్తరించి, అందరిలో తాను ఒకడ్ని అనే భావన విజయానికి మరింత అర్థాన్ని చేకూరుస్తుందన్నారు. ఇలాంటి విజయాలే ఇతరులకు స్ఫూర్తినిస్తాయని, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతాయన్నారు. ‘‘కీర్తి అనేది దానిని సాధించిన వారికి గర్వకారణం. అదే సమయంలో దానిని చూసేవారిలో ఆశను కూడా చిగురింపజేస్తుంది. కాబట్టే సత్యనారాయణ నువాల్, దక్షఖాంటే సాధించిన ఘనత నిస్సందేహంగా గర్వకారణమే అయినప్పటికీ, మేము కూడా దానిపట్ల గర్వంగానే వున్నాం’’ అని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.
నాగపూర్ కూడా గొప్ప విజయాలను సాధిస్తుందని మేమందరమూ విశ్వసిస్తున్నాం. ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చినా, ఇదే విషయాన్ని చెబుతాం. భారత్ కూడా దీనిని సాధిస్తుంది. ఒకవేళ ఇతర గ్రహాలపై జీవం వుండి, అక్కడ ఏదైనా సదస్సు జరిగితే, అప్పుడు మేము భూవాసులు కూడా దీన్ని సాధిస్తారు అనే చెబుతాను’’ అని పేర్కొన్నారు.
ఇక.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ ప్రైవేటు సంస్థల పాత్ర అనిశ్చితంగా ఉన్న సమయంలోనే సత్యనారాయణ నువాల్ రక్షణ ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టారని, ఈ సందర్భంగా ఆయన సాధించిన విజయాలను ప్రశంసించారు. నేడు ఈ రంగం గణనీయమైన శిఖరాలను అధిరోహించిందని, తద్వారా అత్యున్నత నాణ్యత కలిగిన రక్షణ పరికరాలను ఉత్పత్తి చేయగల భారతదేశ సామర్థ్యాన్ని నిరూపించిందని ఆయన తెలిపారు.’ఆపరేషన్ సింధూర్’లో సోలార్ ఇండస్ట్రీస్ చేసిన కీలకమైన కృషిని కూడా ఆయన ప్రస్తావించారు.
ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ప్రపంచ శాంతిని కాపాడడానికి, ప్రతికూల శక్తులపై సానుకూల శక్తులు విజయం సాధించేలా చూడడానికి దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత వుందన్నారు.రక్షణ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో దేశం చురుకుగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.





