ArticlesNews

వృక్షాల సంరక్షణ కోసం కృషి ట్రీ అంబులెన్స్‌

29views

సమస్త జీవరాశులు బతకడానికి ఆక్సిజన్ అవసరం. చెట్ల నుంచి ఈ ఆక్సిజన్ మనుషులకు, ఇతర జంతువులకు అందుతుంది. పారిశ్రామికరణ, నగర విస్తరణ, అభివృద్ధి పేరిట ఇటీవల కాలంలో చెట్లను తెగ నరికేస్తున్నారు. దీంతో పర్యావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మనుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఒడిశాలోని బ్రహ్మపురకు చెందిన యువ పర్యావరణవేత్తలు చెట్ల సంరక్షణ కోసం పాటుపడుతున్నారు. ట్రీ అంబులెన్స్‌తో చెట్లను కాపాడుతున్నారు. ఈ క్రమంలో ట్రీ అంబులెన్స్ ఎలా పనిచేస్తుంది? దీని వల్ల కలిగే ఉపయోగాలేంటి? తదితర విషయాలు తెలుసుకుందాం పదండి.

అభివృద్ధి పనులు, రోడ్లు విస్తరణ పేరిట చెట్ల నరికివేత
పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచడంలో చెట్ల పాత్ర కీలకం. అయితే చెట్లకు కూడా కొన్ని వ్యాధులు సోకుతాయి. అప్పుడు వాటికి సరైన చికిత్స, సంరక్షణ అవసరం. కానీ వృక్షాల సంరక్షణను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎక్కడ అభివృద్ధి పనులు జరిగినా, మొదట చెట్లనే నరికేస్తారు. ఎక్కడ రోడ్డు విస్తరణ పనులు జరిగినా బలైపోయేవి వృక్షాలే. ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మపురలోని ‘సబుజ్ బహిని’ (గ్రీన్ బ్రిగేడ్) అనే స్వచ్ఛంద సంస్థ చెట్లను సంరక్షణకై నడుం బిగించింది. గత పదేళ్లుగా వృక్షాల సంరక్షణ కోసం కృషి చేస్తోంది.

Tree Ambulance In Odisha

ట్రీ అంబులెన్స్ ఇచ్చిన ఎల్ఐసీ
గ్రీన్ బ్రిగేడ్ సభ్యులు బ్రహ్మపురలో ట్రీ అంబులెన్స్ సేవలను అందిస్తున్నారు. చెట్లను నాటడం, వృక్షాల చుట్టూ ఉన్న కాంక్రీటును తొలగించడం, చెట్టుకు ఉన్న ముళ్లను తొలగించడం, కలుపు మొక్కల వల్ల దెబ్బతింటున్న పాత చెట్లను శుభ్రపరచడం, చెదలు పట్టిన చెట్లకు చికిత్స చేయడం వంటి పనులను గత పదేళ్లుగా చేస్తున్నారు. దీంతో వృక్షాల సంరక్షణ కోసం గ్రీన్ బ్రిగేడ్ సభ్యులు చేస్తున్న కృషికి గానూ ఎల్‌ఐసీ తన 100వ వార్షికోత్సవం సందర్భంగా ఒక ట్రీ అంబులెన్స్‌ను అందించింది.

అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల కారణంగా పాఠశాలలు, కళాశాలలు అకస్మాత్తుగా మూతపడుతున్నాయని పర్యావరణవేత్త శంకర్ నారాయణ్ బేజ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వడగాలుల ప్రభావం పశ్చిమ ఒడిశాలో ఎక్కువగా కనిపించేదన్నారు. ఇప్పుడు ఏప్రిల్ నుంచే వడగాలుల ప్రభావం తీరప్రాంత ఒడిశాలో కనిపిస్తోందని వెల్లడించారు. గత నాలుగైదేళ్లలో పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు 40- 45 డిగ్రీలు దాటుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారని అన్నారు.

Tree Ambulance In Odisha

“బ్రహ్మపురలో చెట్ల సంరక్షణ కోసం కృషి చేస్తున్న గ్రీన్ బ్రిగేడ్ ప్రయత్నాల్లో నేను భాగమయ్యాను. ఈ సంస్థ పర్యావరణానికి అనుకూలమైన కార్యక్రమాలు చేపడుతోంది. ట్రీ అంబులెన్స్ ద్వారా గ్రీన్ బ్రిగేడ్ సభ్యులు మొక్కల పెంపకాన్ని విస్తరించగలుగుతున్నారు. రోడ్డు పక్కన నరికివేసిన చెట్ల స్థానంలో కొత్తవి నాటుతున్నారు. ఇది కచ్చితంగా స్వాగతించదగిన చర్య. ఒక చెట్టును నరికే ముందు కనీసం మరో పది చెట్లను నాటాలి. కానీ మనం దాని గురించి ఆలోచిస్తున్నామా? చెట్లు ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. వర్షపాతాన్ని పెంచుతాయి. వాటి జీవితకాలమంతా నీడను అందిస్తాయి” అని శంకర్ నారాయణ్ వెల్లడించారు.

Tree Ambulance In Odisha

నేలను సురక్షితంగా ఉంచడానికి చెట్లను నాటడం ఒక మార్గమని బ్రహ్మపుర నగర గ్రీన్ బ్రిగేడ్ అధ్యక్షుడు శిబ్రామ్ పాణిగ్రహి అభిప్రాయపడ్డారు. గత 12 ఏళ్లుగా గ్రీన్ బ్రిగేడ్ బ్రహ్మపుర నగరం, దాని పరిసర ప్రాంతాల్లో చెట్లను నాటుతూ, వాటి సంరక్షిస్తోందన్నారు. వ్యాధులు సోకిన వృక్షాలకు చికిత్స అందిస్తోందని తెలిపారు. ఈ పని కోసం ఒక ట్రీ అంబులెన్స్‌ ఉందని వెల్లడించారు.

నగరవాసుల సైతం చెట్ల సంరక్షణకు కృషి
చెట్ల సంరక్షణ కోసం గ్రీన్ బ్రిగేడ్ (NGO) చేస్తున్న కృషి బ్రహ్మపుర నగరవాసుల హృదయాలను హత్తుకుంది. దీంతో వారు ‘అడాప్ట్ ఏ ట్రీ డ్రైవ్’ (ఒక చెట్టును దత్తత తీసుకోండి) సందేశంతో స్ఫూర్తి పొందారు. ఈ క్రమంలో అనేక మంది ప్రజలు తమ పుట్టినరోజుల నుంచి వివాహ వార్షికోత్సవాల వరకు వివిధ రకాల శుభదినాలను పురస్కరించుకుని మొక్కలు నాటుతున్నారు.

నేటి కాలంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత అవసరమని బ్రహ్మపుర నగర సీనియర్ ఇంజినీర్ బిర్జా ప్రసాద్ పాత్రా తెలిపారు. బ్రహ్మపురలో గ్రీన్ బ్రిగేడ్ చేపడుతున్న పర్యావరణ సమతుల్యత పనులు మానవ సమాజానికి చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. చెట్లు లేకపోతే జీవరాశుల మనుగడే లేదన్నారు. కానీ వాటిని రక్షించుకోవడంలో మనం తగినంత శ్రద్ధ వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ సందర్భాల్లో రోడ్డు విస్తరణ పనుల పేరిట చెట్లను నరికివేస్తున్నారని, కానీ గ్రీన్ ఆర్మీ మాత్రం ఆ ప్రదేశాలలో మళ్లీ చెట్లను నాటుతోందన్నారు.