ArticlesNews

పెళ్లి కట్నంగా పక్షుల కోసం నీటి కుండలు- పర్యావరణ ఉద్యమంగా వివాహ వేడుక

26views

ప్రస్తుత కాలంలో పెళ్లి కోసం తమ ఆర్థిక పరిస్థితిని సైతం లెక్కచేయకుండా తెగ ఖర్చు చేసేస్తున్నారు చాలా మంది. వివాహాలు సంపదకు ప్రదర్శనలుగా మారుతున్న ఈ రోజుల్లో రాజస్థాన్​లోని బాఢ్​మేర్​కు చెందిన నర్పత్​ సింగ్​ రాజ్​ పురోహిత్ కుటుంబం అనేక మందికి ఆదర్శంగా నిలిచే నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ వరకట్న పద్ధతులకు వ్యతిరేకిస్తూ కట్నంగా పక్షుల కోసం నీటి కుండలను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. బాధ్యత, పర్యావరణ స్పృహ వంటి సందేశాలను పంచుకోవడానికి పెళ్లే సరైన వేదిక అని నిరూపించింది.

బఢ్​​మేర్​కు చెందిన పర్యావరణవేత్త నర్పత్ సింగ్ రాజ్‌పురోహిత్ ‘గ్రీన్‌మ్యాన్’గా పేరుపొందారు. ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే తన మేనకోడలు అంజు కన్వర్ పెళ్లిని కూడా కేవలం కుటుంబానికే కాకుండా అందరికీ చిరస్మరణీయంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా వేసవిలో పక్షులు తమ దాహాన్ని తీర్చుకోవడానికి వీలుగా రూపొందించిన 501 మట్టి నీటి కుండలను కట్నంగా ఇచ్చారు. సంప్రదాయ కట్నపు పద్ధతులకు పూర్తి భిన్నంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

నీటితో నింపుతామని వధూవరులతో పాటు పెళ్లికి హాజరైన సభ్యులు ప్రతిజ్ఞ
సంప్రదాయ వరకట్న పద్ధతులను పూర్తిగా తిరస్కరించి, వాటి స్థానంలో ఒక గొప్ప ప్రయోజనాన్ని అందించే ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు నర్పత్ సింగ్. పక్షులు బతకడానికి ఇబ్బందిపడే కఠినమైన వేసవి నెలల్లో ఈ కుండలను క్రమం తప్పకుండా నీటితో నింపుతామని వధూవరులతో పాటు పెళ్లికి హాజరైన సభ్యులు ప్రతిజ్ఞ చేయాలని కోరారు.

మరింత ఆకర్షణగా ప్రత్యేకమైన రోజు
కొత్తగా పెళ్లి చేసుకున్న అంజు కన్వర్, ప్రవీణ్ సింగ్ రాజ్‌పురోహిత్‌కు ఈ నిర్ణయం వారి ప్రత్యేకమైన రోజును మరింత ఆకర్షణగా మార్చింది. పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతతో తమ ప్రయాణాన్ని కలిసి ప్రారంభించడానికి ఈ పెళ్లి తమకు సరైన అవకాశాన్ని ఇచ్చిందని వధూవరులు అన్నారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదని అభిప్రాయపడ్డారు.

వధూవరుల కుటుంబాల నుంచి మద్దతు
మరోవైపు ఈ నిర్ణయానికి ఇరు కుటుంబాల నుంచి కూడా అపారమైన మద్దతు లభించింది. వధూవరుల తరఫు బంధువులు ఈ ఆలోచనను స్వాగతించడమే కాకుండా, దీని వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా అభినందించారు. తాము దీనిని గర్వంగా స్వీకరించామని వరుడి సోదరుడు కోజరాజ్ సింగ్ చెప్పారు. ఇది నిజానికి ఒక అర్థవంతమైన కార్యక్రమమని, ఈ కుండలను బహుమతిగా పొందిన మొదటి వ్యక్తులం అయినందుకు తాము సంతోషంగా ఉన్నామని అన్నారు.

నర్పత్ సింగ్​కు ప్రశంసలు
ఇదిలా ఉండగా పర్యావరణవేత్త నర్పత్ సింగ్ చేపట్టిన ప్రయత్నాన్ని స్థానిక విద్యావేత్త ప్రేమ్ సింగ్ రాజ్‌పురోహిత్ ప్రశంసించారు. వరకట్న సంబంధిత నేరాలు ఇప్పటికీ వెలుగులోకి వస్తున్న సమాజంలో, ఇలాంటి ఉదాహరణలు ఆలోచనా విధానంలో మార్పును తీసుకువస్తాయన్నారు. ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదని, సమాజం, దేశానికి కరుణ, పర్యావరణ బాధ్యత గురించి ఒక సందేశాన్ని పంపుతుందని అభిప్రాయపడ్డారు. నర్పత్ సింగ్ తీసుకున్న ఈ చర్యను అనేక మందికి ఆదర్శంగా నిలుస్తోంది.