News

హిందూ తత్వశాస్త్రం, సంస్కృతి ఎల్లప్పుడూ ఆధిపత్య ధోరణితో వుండవు : హోసబళే

36views

భారత దేశ నాగరికతతో ప్రేరణ పొందిన ప్రజా ఉద్యమమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అని ఆ సంస్థ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు.వాషింగ్టన్ డీసీలోని హడ్సన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.భారత దేశ నాగరికతా స్ఫూర్తి, సాంస్కృతిక విలువల్లో లోతుగా పాతుకుపోయి, క్షేత్ర స్థాయిలో స్వయంసేవకులతో నడుస్తున్న ఓ ఉద్యమమే ఆరెస్సెస్ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని, కార్య పద్ధతిని వివరించారు.

ఆరెస్సెస్ అనేది భారత దేశ ప్రాచీన సమాజానికి చెందిన సాంస్కృతిక, నైతిక, నాగరికతా విలువలతో ప్రేరణ పొందిన ఓ స్వచ్ఛంద ప్రజా ఉద్యమం అని, దీనినే సాధారణంగా ‘‘హిందూ సంస్కృతి’’ అని కూడా పిలుస్తరాన్నారు.వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, సమాజ సేవ పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తులను తయారు చేస్తుందన్నారు. అలాగే సమాజాన్ని సంఘటితం చేసేందుకు ఆరెస్సెస్ ప్రతి రోజూ శాఖ నిర్వహిస్తోందని, అలాగే వారానికోసారి సాంఘీక్ నిర్వహిస్తోందన్నారు.

అలాగే ఈ గంట సేపు జరిగే శాఖ ద్వారా వ్యక్తుల్లో విలువలను, సమాజ శ్రేయస్సుకోసం పనిచేసే గుణాలను పెంపొందిస్తామని తెలిపారు. అలాగే సమాజం శ్రేయస్సు కోసం, సమాజ సంఘటనం కోసం పనిచేసే వ్యక్తులను తయారు చేయడం తమ లక్ష్యమని వివరించారు. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యల్లో కూడా ఆరెస్సెస్ స్వయంసేవకులు పాల్గొంటారని, అలాగే ఆరెస్సెస్ స్వయంసేవకుల ద్వారా దాదాపు 40 వరకు సంస్థలను కూడా స్థాపించారని వివరించారు.

ఆరెస్సెస్ దృష్టిలో హిందూ అనేది ఓ నాగరికతాపరమైన గుర్తింపే తప్ప, మతపరమైంది కాదని తేల్చి చెప్పారు. మతంతో నేరుగా సంబంధం లేని నాగరికతా విలువలను, సాంస్కృతిక స్ఫూర్తినే ఆరెస్సెస్ ఎప్పుడూ చాటిచెబుతూ వస్తోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అలాగే భారత్ కి దాని పొరుగు దేశాలతో వున్న సంబంధాలు, ఉద్రిక్తతలపై కూడా హోసబళే స్పందించారు. రాజకీయ ప్రయోజనాలు, చరిత్రను తప్పుగా అర్థం చేసుకోవడం, ఇతరత్రా కారణాల రీత్యా ఉద్రిక్తతలు అడపాదడపా కొనసాగుతున్నాయని అన్నారు. వారందరితో నిరంతర, సమగ్ర చర్చలు జరపడం ద్వారా అపోహలను కచ్చితంగా దూరం చేసుకోవచ్చని సంఘ్ విశ్వసిస్తోందని తెలిపారు. సంఘ్ ఇప్పటికే మైనారిటీలకు సంబంధించిన కొందరితో ఇలాంటి చర్చల్లో నిమగ్నమై వుందని వెల్లడించారు.

పొరుగు దేశాలతో ఉద్రిక్తతలకు వివిధ కారణాలు వున్నాయని, ముఖ్యంగా ఆయా దేశాల రాజకీయ నాయకత్వం వల్ల ఏర్పడుతున్నాయని నొక్కి చెప్పారు. గత దశాబ్దాలలో అనేక సందర్భాలలో ఇరు పక్షాల మధ్య పరస్పర సద్భావన, విశ్వాసం దెబ్బతిన్నదని, అయితే అసలు సమస్యంతా ఒకే ఒక పొరుగు దేశంతోనే వుందని తేల్చి చెప్పారు. ఆ దేశం కూడా భారత్ నుంచే ఉద్భవించిందని, ఇప్పుడు అది ఓ పొరుగు దేశంగా మారిపోయిందని అన్నారు. సమస్యలను సృష్టించేందుకు ఆ దేశం వెనుక అనేక శక్తులు, వ్యక్తులు వున్నారన్నారు.

ఆరెస్సెస్ హిందూ ఆధిపత్యాన్ని చూపించే సంస్థ అన్న విమర్శలున్నాయని ప్రశ్న అడగ్గా.. హోసబళే స్పందిస్తూ.. హిందూ తత్వశాస్త్రం, సంస్కృతి ఎల్లప్పుడూ ఆధిపత్య ధోరణితో వుండవని, ప్రాణం వున్నదానిలో అయినా, ప్రాణం లేనిదానిలో అయినా.. తాము ఎల్లప్పుడూ ఏకత్వాన్నే చూస్తామని స్పష్టం చేశారు.హిందువుల ప్రాథమిక సూత్రం అదే అని, అలాంటప్పుడు ఆధిపత్య ధోరణి ఎలా వుంటుందని, వుండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హిందువులు వేరే దేశంపై దండయాత్రలు చేసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని, ఏ ప్రజలను కూడా బానిసలుగా తయారు చేయలేదని, హిందువులు అసలు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదని హోసబళే తేల్చి చెప్పారు.