ArticlesNews

ఆదర్శ వివాహం.. కట్నంగా పక్షుల కోసం మట్టి కుండలు…

45views

ఈ రోజుల్లో పెళ్లి ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. హంగూ, ఆర్భాటాలు, వీఐపీలు, కట్నాలు, కానుకలు… బోల్డు… ఇలా చెప్పుకుంటూ పోతే.. ఓ పెద్ద లిస్టే బయటపడుతుంది. కానీ.. బార్మర్ కి చెందిన పర్యావరణ వేత్త, గ్రీన్ మ్యాన్ ‘‘నర్పత్ సింగ్ రాజ్ పురోహిత్’’ మాత్రం తన మేనకోడలి పెళ్లిలో అత్యంత వెరైటీ కట్నం ఇచ్చారు.

ఇందులో భాగంగా వేసవిలో పక్షుల దాహం తీర్చేలా చెట్లకు వేలాడదీసేందుకు వీలుగా మట్టికుండలను కట్నంగా ఇచ్చారు. ఒకటో, రెండో కాదు.. ఏకంగా 500 మట్టి కుండలను కట్నంగా ఇచ్చారు. ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోందని, దీంతో పక్షులు దాహం తీర్చుకోవడానికి చాలా ఇబ్బందులు వస్తాయని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వేసవి రోజుల్లో ఈ కుండలను క్రమం తప్పకుండా నీటితో నింపుతామని కూడా వధూవరులతో, పెళ్లికి హాజరైన వారందరితో ప్రమాణ చేయించారు.

ఈ చొరవ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. మన హిందూ సంప్రదాయంలో ఏ వేడుక, పండగ జరిగినా.. లేదా ఏ శుభ కార్యం జరిగినా.. ఆ కుటుంబంతో పాటు తోటి సమాజం, పశు పక్ష్యాదులు కూడా ఎంతో కొంత లాభం పొందేలా మహర్షులు రూపకల్పన చేశారు. కానీ.. నేటి ఆధునిక సమాజంలో ఇది కొంత లోపిస్తోంది. కానీ.. గ్రీన్ మ్యాన్ ‘‘నర్పత్ సింగ్ రాజ్ పురోహిత్’’చేసిన ఈ పని ఈ తరానికి స్ఫూర్తిదాయకం. దీనిద్వారా అందరికీ పర్యావరణంతో అనుబంధం ఏర్పడుతుందని, మమకారం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.

పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతతో తమ కొత్త జీవితాన్ని కలిసి ప్రారంభించడానికి ఈ పెళ్లి ఓ వేదికైందని, నర్పత్ సింగ్ రాజ్ పుత్ చేసిన పనితో పర్యావరణం వైపు మరింతగా ఆలోచించడానికి మాకు ప్రేరణ దొరికిందని నూతన వధూవరులు పేర్కొంటున్నారు.

గ్రీన్‌మ్యాన్’ చేపట్టిన ఈ విశిష్టమైన చొరవ, తన మేనకోడలి వివాహ వేడుకను పర్యావరణ పరిరక్షణ మరియు జీవుల పట్ల కరుణ కోసం ఒక పెద్ద ప్రచారంగా మార్చింది. తన మేనకోడలు అంజు కన్వర్ రాజ్‌పురోహిత్ వివాహంలో, గ్రీన్‌మ్యాన్ నర్పత్ సింగ్ శతాబ్దాల నాటి కట్నపు ఆచారాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ, కొత్త అలవాటుకు శ్రీకారం చుట్టారు.వస్తువులు, సంపదకు బదులుగా మట్టి నీటికుండలను కట్నంగా ఇచ్చారు.

మరో వైపు గ్రీన్ మ్యాన్ ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనకు వధువు, వరుడు రెండు కుటుంబాల నుంచీ సంపూర్ణ మద్దతు లభించింది. ఇరు కుటుంబాల సభ్యులు కూడా ఈ చొరవను ఎంతో ప్రశంసించారు. ‘‘మేము పక్షుల దాణా తొట్టెలను సంతోషంగా స్వీకరించాం. ఇది అత్యంత ప్రశంసనీయం. ఇది కేవలం ఒక కుటుంబానికి గానీ, ఒక సమాజానికి గానీ మాత్రమే కాకుండా—సమస్త దేశానికి, జీవులపట్ల దయ, పర్యావరణకు సంబంధించిన ఒక అంశం’’ అని పేర్కొన్నారు.