
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కార్యక్రమంలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి కళ్లద్దాల దిగ్గజ సంస్థ లెన్స్‌కార్ట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, సంస్థపై వచ్చిన ‘తిలక్ నిషేధం’ ఆరోపణల నేపథ్యంలో ఘాటుగా స్పందించారు. హిందూ మత చిహ్నాలను గౌరవించలేని సంస్థలు భారతదేశంలో కార్యకలాపాలు కొనసాగించాల్సిన అవసరం లేదని, అవసరమైతే తమ వ్యాపారాన్ని లాహోర్ వంటి ప్రాంతాలకు తరలించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన ‘హనుమాన్ కథ’ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రి, సంస్థ డ్రస్ కోడ్ విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యోగులు తిలకం, సింధూరం, మంగళసూత్రం వంటి మతపరమైన గుర్తులు ధరించడాన్ని నిరోధిస్తున్నారని వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఇది మత స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన అన్నారు. , “ఈ రోజు మంగళసూత్రంపై అభ్యంతరం చెప్పే వారు, రేపు గీత, రామాయణం వంటి గ్రంథాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఈ తరహా చర్యలను తేలికగా తీసుకోరాదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లెన్స్‌కార్ట్ వివాదం మరింత ఉధృతమైంది. నగరంలోని ప్రముఖ న్యూ మార్కెట్ ప్రాంతంలో ఉన్న లెన్స్‌కార్ట్ అవుట్‌లెట్‌ను హిందూ ఉత్సవ్ సమితి కార్యకర్తలు ఘెరావ్ చేశారు. ‘తిలక్ నిషేధం’ ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసన చేపట్టినట్లు సమాచారం.
నిరసన సందర్భంగా కార్యకర్తలు మంత్రోచ్చారణలు చేస్తూ, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు తిలకం దిద్ది, వారి మణికట్టుకు పవిత్ర దారం కట్టారు. “సనాతనానికి ఎలాంటి అవమానాన్ని హిందుస్థాన్ సహించదు” అంటూ నినాదాలు చేస్తూ సంస్థ విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
ఈ నిరసనతో, లెన్స్‌కార్ట్ చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు మత, సామాజిక సంస్థలు ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, వివిధ నగరాల్లో కూడా ఇలాంటి ఆందోళనలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.





