
కర్ణాటకలో ‘హవ్వా..’ అనిపించే ఘటన చోటుచేసుకుంది. పరీక్షకు వచ్చిన విద్యార్థినులు ముక్కు పుడక ధరించి రావడంతో.. సిబ్బంది వారికి గమ్ టేప్ అతికించి పరీక్షా హాలులోకి పంపించారు. కొంతమంది అమ్మాయిలు ఈ విషయాన్ని వీడియో తీసి నెట్‌లో పెట్టడంతో చర్చ మొదలైంది.
చిక్కమగళూరు ఎంఈఎస్ కళాశాలలో సీఈటీ పరీక్షా కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఇలాంటి పరీక్షలకు డిజిటల్ వాచ్, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఆభరణాలపై నిషేధం ఉంటుందని తెలిసిందే. ఈ క్రమంలో ముక్కు పుడకలు ధరించి వచ్చిన అమ్మాయిలపై తనిఖీ సిబ్బంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే..
అమ్మాయిలు ముక్కుపుడక తీయడానికి సిబ్బంది ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో వాళ్లకు టేప్ అంటించారు. పరీక్షలు అయ్యాక.. టేప్ తొలగిస్తూ అమ్మాయిలు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వదిలారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని.. రూల్స్‌ను తాము ఫాలో అయ్యామని కాలేజీ యాజమాన్యం చెబుతోంది.





