News

నవధాన్యాలతో జవసత్వాలు

7views

వ్యవసాయమే జీవనాధారమైన   రైతులు గతంలో ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము, పెసర, మొక్కజొన్న, బొబ్బర్లు, నువ్వులు వంటివాటితోపాటు పశుగ్రాసానికి పిల్లిపెసర, జనుము, జొన్న వంటివాటిని పండించేవారు. మూడవ పంటగా అపరాలు, పశుగ్రాసం పండించడం వల్ల భూమికి సహజంగా పోషకపదార్థాలు లభించేవి. అయితే కొన్నేళ్లుగా వరిసాగులో జాప్యం కారణంగా దాళ్వా వరి పంట ఏప్రిల్‌, మే నెలల్లో చేతికి రావడంతో మూడవ పంట వేయడానికి సమయం సరిపోవడం లేదు. దీంతో మిగిలిన రెండు పంటల్లో దిగుబడి పెంచుకునేందుకు రైతులు పెద్ద మొత్తంలో ఎరువులు వేయాల్సి రావడంతో పెట్టుబడుడులు పెరిగి రైతులు నష్టపోతున్నారు. అయితే పాత విధానంతో మూడు పంటలు పండించడానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మూడో పంటకు ప్రోత్సాహం

పశ్చిమగోదావరి  జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 2.30 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దీనిలో మూడవ పంట పండించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత దాళ్వా సీజన్‌ ఊపందుకుంటున్న తరుణంలో అపరాల సాగుతోపాటు పశుగ్రాసం పెంచేందుకు రైతులకు ఏపీ అగ్రికల్చర్‌ కమ్యూనిటీ నేషనల్‌ ఫార్మింగ్‌ సిస్టం ద్వారా 50 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తున్నారు. దీనికిగాను వ్యవసాయశాఖ, డ్వాక్రా సంఘాలతో ప్రత్యేకంగా సేకరించిన మినుము, పెసర, జీలుగు, రాగి, సజ్జలు, నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, పిల్లిపెసర, జనుము, మొక్క వంటివాటితోపాటు ఆరుకూరలైన తోటకూర, పాలకూర, మెంతుకూర, చుక్కుకూర, గొంగూర, బీర, అనప, దోస వంటి సుమారు 12 రకాలు కలిగిన 12 కిలోల విత్తనాలను కిట్లుగా తయారుచేసి పంపిణీ చేశారు.

ప్రయోజనం ఏమిటంటే..

భూమిలో సారాన్ని సహజంగా పెంచడానికి వేరు వ్యవస్థ ఎంతగానో దోహదం చేస్తుంది. అందువల్ల వివిధ రకాల విత్తనాలు కలగలిపి చేలలో వేయడం వల్ల రైతులకు కొంతమేరకు ఆదాయంతోపాటు ఇంటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా వివిధ రకాల తీగ, ఆకుజాతి మొక్కల వేర్లు వల్ల భూమిలో బ్యాక్టీరియా వృద్ధిచెంది సహజ సిద్ధంగా భూసారం పెరుగుతుంది. దీనితో వరి పండించడానికి ఎక్కువ మోతాదులో ఎరువులు వాడే అవసరం లేకపోవడమేగాక తెగుళ్లు కూడా తగ్గే అవకాశముంటుంది. భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల రైతులు పంటలకు కొద్దిమొత్తంలో ఎరువులు వేసినా వాటి సామర్ధ్యం పెరిగి పంటకు ప్రయోజనం కలుగుతుంది. దాళ్వా మాసూళ్లు వరికోత యంత్రాలతో చేస్తున్నా విత్తనాలు వేసుకోడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వరిపైరు కోత కోసేముందు భూమిలో కొద్దిపాటి తేమ ఉండే విధంగా చూసుకుంటే విత్తనాలు జల్లుకోడానికి అనువుగా ఉంటుంది.

దాళ్వా అనంతరం నవధాన్యాల సాగు గతేడాది ప్రయోగాత్మకంగా చేపట్టాం. దీనివల్ల రైతులకు కొంత ఆదాయం రావడమేగాక భూసారాన్ని సహజసిద్ధంగా పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుత సీజన్‌లో దాదాపు 40 వేల మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్ని రైతు సేవాకేంద్రాలు, డ్వాక్రా సంఘాల వద్ద విత్తనాల కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎక్కువమంది రైతులకు కావాలన్నా సరఫరా చేయిస్తాం. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.– జెడ్‌ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి