News

“ముచ్చటగా 34 ప్రశ్నలు” – ‘జనగణన’లో మిమ్మల్ని ఏం అడుగుతారో తెలుసా?

15views

కొవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన జన గణన వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోగా పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇదే సమయంలో కులగణన కూడా పూర్తి చేయాలని కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు తొలిసారిగా ఓబీసీ కులాల వివరాలనూ సేకరించనుంది. మొదటి దశలో భాగంగా ఇండ్ల జాబితా, ఇండ్ల గణన(2026 మే), రెండో దశలో జనాభా గణన (2027 ఫిబ్రవరి) చేయనున్నారు. తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో “Census 2027 – HLO” మొబైల్ యాప్ ఉపయోగించి సమాచార సేకరణ చేపట్టనున్నారు. ఇదే సమయంలో ఎవరికి వారు తమ వివరాలను ఆన్​లైన్​లో పొందుపరిచే అవకాశాన్ని కల్పించారు. స్వీయ గణన ద్వారా ఇచ్చిన సమాచారాన్ని ఎన్యూమరేటర్లు ధ్రువీకరించాల్సి ఉంటుంది.

రెండు దశల్లో ప్రజల గృహ స్థితి, మౌలిక వసతులు, ఆస్తుల కీలక సమాచారం రూపొందించేలా మొత్తం 34 రకాల ప్రశ్నావళి రూపొందించారు. వాటి ఆధారంగానే సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేయనున్నారు.

తొలి దశలో అడిగే ప్రశ్నిలివే !

ఇంటి నంబరు నమోదు చేసుకుంటారు.
ఫ్లోర్ (టైల్స్, మార్బుల్స్), గోడలు, పైకప్పు నిర్మాణంలో ఏ మెటీరియల్‌ ఉపయోగించారో నమోదు చేస్తారు.
ఇంటి పరిస్థితి ఎలా ఉంది?
ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు, కుటుంబ యజమాని పేరు, మహిళా? పురుషుడా అడిగి తెలుసుకుంటారు.
ఇంటి పెద్ద కులం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ).
ఇంటి యాజమాన్య వివరాలు.
ఇంట్లో ఉంటున్న నివాస గదులెన్ని?
ఆ ఇంట్లో ఉంటున్న వివాహమైన జంటలు
తాగు నీటికి ప్రధాన వనరు ఏంటి?
విద్యుత్తు, మరుగుదొడ్డి సౌకర్యాలు ఉన్నాయా? ఎలాంటి మరుగుదొడ్డి వాడుతున్నారు?
వృథా నీరు వెళ్లడానికి కనెక్షన్‌ ఉందా?
ఇంటి పరిధిలోనే స్నానాల గది ఉందా?
వంటశాల లభ్యత, వంటకు ఉపయోగిస్తున్న ఇంధనం ఏమిటి?
ఎలాంటి తృణ ధాన్యాలను వినియోగిస్తున్నారు?
రేడియో/టీవీ/ఫోన్‌/మొబైల్‌/ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉందా?
కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ వినియోగిస్తున్నారా?
కారు, బైక్, ఇతర వాహనాలు ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకుని నమోదు చేస్తారు.
బ్యాంకింగ్‌ సేవలను వాడుకుంటున్నారా?

రెండోదశలో సమాచార సేకరణ ఇలా

కుటుంబ సభ్యుల పేరుతో పాటు ఇంటి యజమానితో సంబంధం ఏమిటో నమోదు చేస్తారు. స్త్రీ, పురుషుడు, పుట్టిన తేదీ, వయసు, జన్మ స్థలం, వివాహ స్థితి, ఏ వయసులో పెళ్లి జరిగింది? ఎంతమంది పిల్లలున్నారు తదితర వివరాలు అడిగి రికార్డు చేస్తారు.

ఏ మతానికి చెందిన వారు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనే వివరాలు సేకరిస్తారు. వైకల్యం, అక్షరాస్యత, విద్యార్హత, మాతృభాష, ఇతర భాషలపట్ల అవగాహన, ప్రస్తుతం చేస్తున్న పనితో పాటు గత ఏడాది కాలంగా చేస్తున్న పనులు కూడా అడుగుతారు. పని, ఆర్థిక కార్యకలాపాలు, ఏ పరిశ్రమలో పని చేస్తున్నారో సమాచారం సేకరిస్తారు.

వ్యాపారం చేస్తున్నరా? లేక ఉద్యోగాల్లో కొనసాగుతున్నారా అనే విషయాలు అడిగి తెలుసుకుంటారు. చివరిగా నివసించిన ప్రాంతం, వలస వెళ్లడానికి కారణాలు, ప్రస్తుతం ఎక్కడ, ఎంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు అనే అనే వివరాలు సేకరిస్తారు.