ArticlesNews

చతుర్విధ పురుషార్థాలే మానవ మనుగడ

31views

తుర్విధ పురుషార్థాలే లక్ష్యంగా మానవుడు మనుగడ కొనసాగించాలని భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం ప్రబోధిస్తోంది. ఆ పురషార్థాల్లో మొదటిది ధర్మం. మనిషి ప్రతి చర్యా ధర్మ సహితంగానే ఉండాలి. ధర్మరహితమైన అర్థకామాలు లభించినా వాటిని వదిలివేయాలి. లోక విరుద్ధమైన ధర్మాన్ని స్వీకరించరాదు… అంటుంది భవిష్య పురాణం. విజ్ఞులంతా ధర్మమే మోక్ష సోపానమని చెప్పారు… చెబుతున్నారు.

మహాభారతంలో ఎన్నెన్నో కథలు ధర్మ పరిరక్షణ అవసరాన్ని వివరించాయి. మానవ సమాజాన్ని ధర్మం పునాదులపై విలువలతో నిర్మించుకోవాలని రామాయణ, భాగవతాలు బోధిస్తున్నాయి. వేదవర్మ దంపతులు ప్రశాంత జీవనం కోసం ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్వేషణ చేశారు. పిల్లలు లేకపోవడంతో ధర్మబద్ధమైన తపస్సునాచరించి, దేవుడి కృప సంపాదించాలనుకున్నారు. గాలి, నీరు, విస్తారమైన వృక్ష సంపదతో తులతూగే చోట ఆశ్రమం నిర్మించుకున్నారు. వీరివంటి వారే మరికొందరు అక్కడకు చేరుకున్నారు. నిరంతరంగా యజ్ఞయాగాలను చేసుకుంటున్నారు. ఒకనాడు ఒక యాజి తాలూకు ఉచ్చిష్ఠం అగ్నిలో పడి స్వర్ణంగా మారింది. అతడు ఆశ్చర్యపోయాడు. మళ్లీ ఆ పనిచేశాడు. ఈసారీ అది కాంచనంగా మారింది. ఇంకేముంది? అందరూ ఆ అధర్మ పద్ధతిని వారం రోజులు అనుసరించారు. బంగారాన్ని మూటకట్టుకున్నారు. తోటివారి మాటలతో వేదవర్మ భార్య కూడా స్వర్ణం సంపాదించమని పతిని కోరింది. అయాచితంగా లభించే సంపద అనర్థదాయకమని ఆమెకు నచ్చజెప్పాడు. ఆమె వినలేదు. ఒకరోజు మూటాముల్లె సర్దుకుని భార్యను తీసుకుని ఇల్లు వదిలాడు. ఆశ్రమం దాటి వందడుగులు వేయగానే యజ్ఞగుండంలోని నిప్పురవ్వలు గాలికి చెలరేగి క్షణాల్లో మొత్తం ఇళ్లను కాల్చివేసింది. ప్రకృతికి తెలుసు ధర్మమేంటో..! స్వర్ణం దక్కించుకునేందుకు ప్రయత్నిం చినవారంతా ప్రాణాలు కోల్పోయారు. వేదవర్మ దంపతులు నిశ్చేష్టులయ్యారు. ‘వేదవర్మా… వారంతా అధర్మ వర్తనులు. వారికోసం విచారించకు. ఇంతకాలం నీ ధర్మాచరణే వారందరిని కాపాడింది. నువ్వొక్కడివే నా ప్రభావానికి లోనుకాలేదు. వెళ్లు… ధర్మవర్తనతో జీవించు’ అన్న కలి పురుషుడి మాటలు ఆ దంపతులకు దిశానిర్దేశం చేశాయి.

మహాభారతం ‘ధర్మో రక్షతి రక్షితః’ అని చెప్పింది. ధర్మం ద్వారానే అన్ని సుఖాలు లభిస్తాయి. కానీ, అధర్మపరులు సుఖంగా సంపదలతో తులతూగుతున్నారని… ధర్మవర్తనులు పేదరికంతో బతుకులీడుస్తున్నారనే అపప్రథ సమాజంలో ప్రచారంలో ఉంది. ఇది బాహ్యదృష్టి, హ్రస్వదృష్టి. లోతుగా గమనిస్తే ‘అధర్మం’ చివరి స్థితి ఏంటో దృశ్యమానమవుతుంది. తాత్కాలిక ఆనందం కన్నా శాశ్వతమైన ధర్మాచరణే గొప్పదని గ్రహించడమే జ్ఞానం.

రామాయణం బాలకాండ మొదటి సర్గలో రాముడి తత్వం వివరిస్తూ వాల్మీకి ‘రక్షితా జీవ లోకస్య ధర్మస్య పరి రక్షితా…’ అనే అద్భుతమైన శ్లోకం చెబుతాడు. ధర్మం, రాజనీతి, సమాజనీతి వేరువేరని భావిస్తున్న వర్తమాన సమాజానికి ఈ శ్లోకం చక్కని సమాధానమిస్తుంది. ధర్మాచరణకు రాముడికన్నా గొప్ప ప్రతినిధి ఎవరున్నారు?