ArticlesNews

వేసవి సెలవులు విజ్ఞాన – వినోదాలకు నెలవులు

39views

వార్షిక పరీక్షలు పూర్తి అయిన తర్వాత విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆతిథ్యం ఇచ్చే వేసవి సెలవుల కోసం విద్యార్థిలోకం ఎంతగానో ఎదురు చూస్తుంటుంది. ఏడాదిలో ఒక్కసారి లభించే సుమారు రెండు మాసాల సెలవులు యువతకు ఎన్నో రకాల అనుభవాలను మూటకట్టి పెడతాయి. ఊపిరాడనంతగా యాంత్రిక జీవనం గడిపిన విద్యార్థులు విద్యాలయ దినచర్యకు దూరంగా కొన్ని వారాల పాటు విశ్రాంతి, వినోద విరామాలు పొందుతూ తమకు నచ్చిన కార్యక్రమాలలో పాలు పంచుకొనేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. తమకు నచ్చిన రీతిలో వేసవి సెలవులు గడపడానికి పిల్లలు పథకాలు వేస్తూ ఉంటారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడి తమ అభిరుచులు, ఆసక్తి కలిగిన పనులు, ఆటపాటలు, ఆన్‌లైన్‌లో మునకలు, సినిమాలు, పర్యాటక ప్రయాణాలు, క్రీడా ప్రాంగణా లకు పరు గులు, అమ్మచేతి వంట రుచులు, దర్శనీయ స్థలాల పయనాలు, వినోద విజ్ఞాన వేదికలు, ఆరోగ్యం కాపాడు కునే కార్యాలు, మానసిక ఉల్లాస విందులు, సృజన/విలక్షణ ఆలోచనలు, తమకు నచ్చిన ఫైన్‌ ఆర్టస్‌లో శిక్షణల కోరికలు లాంటి అనేక ప్రణాళికలను నిజం చేసుకునే సమయంగా వేసవి సెలవులు ఉపకరిస్తాయి.

అవసరం మేరకు నిద్ర పోవడం, మెదడు చురుదనం పెంచడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించే అంశాలకు సమయం ఇవ్వడం వేసవి సెలవుల్లో మాత్రమే జరుగుతుంది. నచ్చిన పుస్తకాలు చదవడం, విజ్ఞాన వినోదాత్మక సినిమాలు చూడడం, సుస్వర సంగీతం వినడం, ఆటపాటల్లో మునిగి తేలడం, కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో కలిసి బయటకు వెళ్లడం లాంటివి మానసిక వికాసానికి, మనసును తేలిక పర్చుకోవడానికి ఉపకరిస్తాయి. మన ప్రేమను చూరగొన్న సమీప బంధువులు లేదా మిత్రుల వద్దకు వెళ్లడం, పిక్నిక్‌/‌జూ/సర్కస్‌/ఎగ్జిబిషన్‌లకు వెళ్లడం, నచ్చిన క్రీడలు లేదా కళల్లో శిక్షణ తీసుకోవడం, వ్యక్తిత్వ వికాస ఆన్‌లైన్‌ ‌లేదా ఆఫ్‌లైన్‌ ‌తరగతులకు హాజరుకావడం లాంటివి మంచి నిర్ణయాలు. కొత్త ప్రదేశాలు, ప్రకృతి సహజ అందాల ఆస్వాదనలు, ప్రకృతిలో దాగిన అద్భుతాల ఆవిష్కరణలు, ఈత నేర్చుకోవడం, సైక్లింగ్‌ ‌లేదా బైక్‌ ‌నేర్చుకోవడం, మనకు నచ్చిన అభిరుచులను పెంచి పోషించు కోవడం, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం, సామాజిక సంబంధాలను పటిష్ట పరుచుకోవడం, మానవ సంబంధాలను పెంచుకోవడం, సహకార భావనలతో పది మందితో కలిసి పని చేయడం లాంటి పలు కార్యక్రమాలకు వేసవి సెలవులు నెలవులు కావాలి. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం లేదా హాజరు కావడం, వేసవిలో పార్ట్‌టైమ్‌ ‌విద్య సంబంధ ఉద్యోగాలు చేయడం, ప్రయాణాలు చేస్తూ వినోద విజ్ఞానాలను పెంచు కోవడం, వ్యవసాయ క్షేత్రాల్లో గడపడం లాంటివి పిల్లల వ్యక్తిత్వాలను, అవగాహన శక్తులను మెరుగు పరుచుతాయి.

ఆధునిక డిజిటల్‌ ‌యుగంలో పుట్టుకొస్తున్న శాస్త్రసాంకేతిక ప్రగతి ఫలాలను ఆస్వాదించడం లేదా నూతన నైపుణ్యాలను అవగాహన చేసుకోవడం, సంగీతం, నాట్యం, చిత్రకళ నేర్చుకోవడం, సంగీత వాయిద్యాల్లో శిక్షణలు, కవిత్వం/వ్యాస రచన/కథలు రాయడంతో సాహిత్య రంగంలో తొలి అక్షర అడు గులు వేయడానికి సెలవులు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఆసక్తి కలిగిన వారు కొత్త భాషను నేర్చు కోవడం, డిజిటల్‌ ‌నైపుణ్యాలను మెరుగు పరుచు కోవడం, ఆన్‌లైన్‌ ‌కోర్సుల ద్వారా నైపుణ్యాలకు పదును పెట్టడం, జనరల్‌ ‌నాలెడ్ది పెంచుకోవడం, దిన పత్రికలను చదవడం, పాఠ్యాంశాలకు సంబంధించిన అదనపు పరిజ్ఞానాలను పొందడం, మానసిక పరిపక్వతకు ఆజ్యం పోసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరు కావడం లాంటివి పిల్లలకు అందుబాటులో ఉంచాలి. నైపుణ్యాలు, విజ్ఞానం, సామర్ధ్యాలకు పదును పెట్టడం లాంటివి మరువరాదు.

నేటి ఆరోగ్యమే రేపటి భవితకు పెట్టుబడి అని, ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్ముతూ వేసవి సెలవుల్లో ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. తగినంత సమయం నిద్ర పోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, పరిమిత సమయం పాటు ఆటపాటలకు కేటాయించడం, ప్రతి రోజు కొంత సమయం వ్యాయామం, యోగా, నడక, చేయడం, సూర్యోదయాన్ని చూసి వీక్షించడం మరువరాదు. వీటికి తోడుగా తోట పనుల్లో నిమగ్నం కావడం, పర్యావరణ పరిరక్షణ సేవలు, నిస్వార్థ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, శ్రమదాన కార్యక్రమాలు చేయడం, అనాథాశ్రమాలను సందర్శించి వారికి చేతనైనంత తోడ్పాటు ఇవ్వడం,ఇష్ట దైవపూజ చేయడం, దేవాలయాలు లేదా ప్రార్థనా స్థలాలను సందర్శించడం ఉత్తమం అని భావించాలి.

తల్లితండ్రుల పాత్ర
పిల్లలు వేసవి సెలవులను సమర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా గడపడంలో తల్లితండ్రుల పాత్ర అధికమని గమనించాలి. వేసవి సెలవులలో పిల్లల దురలవాట్లు లేదా అనారోగ్యకర దినచర్యలకు అలవాటు పడకుండా చూసుకోవడం పెద్దల కనీస కర్తవ్యం అని తెలుసుకోవాలి. అధిక కాలం పాటు స్మార్ట్‌ఫోన్‌ ‌వాడడం లేదా టీవీ ముందు కూర్చోవడం మంచి అలవాటు కాదని వారించడం మరువరాదు. ఎండలను గమనిస్తూ, గంటల తరబడి మైదానాల్లో ఆడకుండా, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతి నిద్ర లేదా అతిగా తినడం లేదా అతి గారాబానికి ఆస్కారం ఇవ్వకండి. డ్యాన్స్, ‌ఫైన్‌ ఆర్ట్, ‌స్విమ్మింగ్‌, ‌సైక్లింగ్‌, ‌మ్యూజిక్‌, ఆటలు లాంటివి నేర్పించండి. వేసవి సెలవులు పూర్తి స్వేచ్ఛకు నెలవులు కావని, వినోదంతో పాటు విజ్ఞానం, ఆటపాటలతో పాటు శారీరక మానసిక వికాసం, ఆన్‌లైన్‌లో సంచరిస్తూ దురలవాట్ల కోరల్లో పడకుండా రేపటి బాధ్యత కలిగిన పౌరులుగా మారడానికి నేటి పిల్లలకు వేసవి సెలవులు ఉపయుక్తం కావాలని కోరుకుందాం..

డా. బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
9949700037